Telugu Global
Andhra Pradesh

అమరావతి రైతులు రూల్స్ పాటించాల్సిందే.. హైకోర్ట్ ఆదేశం..

నాయకులెవరైనా మద్దతు తెలపాలనుకుంటే, స్థానికులెవరైనా వారికి సంఘీభావం తెలపాలనుకుంటే.. యాత్ర జరిగే సమయంలో రోడ్డుపక్కనే నిలబడాలి. రోడ్డుపక్కన నిలబడి వారికి సంఘీభావం తెలపాలి.

అమరావతి రైతులు రూల్స్ పాటించాల్సిందే.. హైకోర్ట్ ఆదేశం..
X

అమరావతి రైతులు తమది పాదయాత్ర అంటారు, వైసీపీ నేతలు అది దండయాత్ర అంటున్నారు. అందులో రైతులు లేరు, ఆకుపచ్చ కండువాలు కప్పుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నేతలు.. పాదయాత్రలో పాల్గొని ప్రజల్ని రెచ్చగొడుతున్నారనేది వైసీపీ నేతల అభియోగం. ఇటీవల యాత్రలో శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తుతోంది. దీంతో హైకోర్టు పాదయాత్ర విషయంలో మార్గదర్శకాలు పాటించాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. పోలీసులు తమ యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక ఆదేశాలిచ్చింది.

600మంది మాత్రమే..

పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని మరోసారి స్పష్టం చేసింది హైకోర్టు. వారు మినహా ఇంకెవరూ యాత్రలో పాల్గొనడానికి లేదని తేల్చి చెప్పింది. నాయకులెవరైనా మద్దతు తెలపాలనుకుంటే, స్థానికులెవరైనా వారికి సంఘీభావం తెలపాలనుకుంటే.. యాత్ర జరిగే సమయంలో రోడ్డుపక్కనే నిలబడాలి. రోడ్డుపక్కన నిలబడి వారికి సంఘీభావం తెలపాలి. అంతే కానీ, వారితో కలసి రోడ్డుపై నడవకూడదు, యాత్రలో పాల్గొనకూడదు అంటూ ఆదేశాలిచ్చింది హైకోర్ట్. కోర్టు అనుమతి ఇచ్చిన వారు తప్ప వేరేవాళ్లు పాదయాత్రలో పాల్గొనకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.

4వాహనాలకే పరిమితం..

పాదయాత్రలో నాలుగు వాహనాలను మాత్రమే ఉపయోగించాలని హైకోర్టు సూచించింది. వాహనాలతో కాన్వాయ్ లను ఏర్పాటు చేసి హంగు ఆర్భాటాలతో యాత్ర చేయాలనుకోవద్దని సూచించింది. ఈ నిబంధన‌లు పాటించడంలో విఫలమైతే పాదయాత్ర నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించింది హైకోర్టు. వాస్తవానికి పోలీసులు అడ్డుకుంటున్నారు, తమకు మరిన్ని వెసులుబాటులు ఇవ్వాలంటూ అమరావతి పరిరక్షణ సమితి కోర్టులో పిటిషన్ వేసింది. కానీ కోర్టు మాత్రం వారికి నిబంధనలు పాటించాల్సిందేనని మరోసారి గట్టిగా చెప్పడం విశేషం.

First Published:  22 Oct 2022 2:57 AM GMT
Next Story