Telugu Global
Andhra Pradesh

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలపై హైకోర్టు స్టే. కారణం అదేనా..?

పిటిషనర్ వాదనలో అర్థమున్నట్టుగా అనిపిస్తోందని అభిప్రాయపడ్డ హైకోర్టు.. ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలపై హైకోర్టు స్టే. కారణం అదేనా..?
X

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఫలితాలను వెల్లడించవద్దని ఆదేశించింది. కార్యవర్గానికి సంబంధించి ఆరు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఒక్కో స్థానానికి ఒక్కో నామినేషన్ చొప్పున మాత్రమే దాఖలయ్యాయి. దాంతో ఆరుగురు వ్యక్తులు ఏకగ్రీవం కాబోతున్నారు. అధ్యక్షుడిగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు, అరవిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా విజయసాయిరెడ్డి సొంత అల్లుడు రొహిత్ రెడ్డి, కార్యదర్శిగా గోపినాథ్ రెడ్డి ఏకగ్రీవం అవడం ఖాయమైంది.

ఈ ఎన్నికలను సవాల్ చేస్తూ చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్‌ కుమార్ హైకోర్టుకు వెళ్లారు. శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నారని.. ఇప్పటికే అరెస్ట్ కూడా అయ్యారని.. అలాంటి వ్యక్తి ఏసీఏ అధ్యక్షుడిగా ఉండడం సరికాదంటూ పిటిషన్ వేశారు. డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు రంగం సిద్ధ‌మైందని కాబట్టి అడ్డుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు.

జస్టిస్ లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం జిల్లా క్రికెట్ అసోసియేషన్లకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని.. కానీ ఇక్కడ మాత్రం ప్రైవేట్ క్రికెట్ క్లబ్బులకూ ఓటు హక్కు ఇచ్చారని, ఓటు హక్కు ఉన్న వారితో కుమ్మక్కై వివిధ పోస్టులకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యేలా చేశారని కోర్టుకు వివరించారు. లోథా కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహారం నడించిందని వాదించారు.

పిటిషనర్ వాదనలో అర్థమున్నట్టుగా అనిపిస్తోందని అభిప్రాయపడ్డ హైకోర్టు.. ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.

బీసీసీఐలో అమిత్ షా కుమారుడు చక్రం తిప్పుతున్నారని.. ఆయనకు దగ్గరయ్యేందుకే విజయసాయిరెడ్డి ఇలా తన అల్లుడు, అతడి సోదరుడు, తన సన్నిహితులతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ను నింపేందుకు ప్రయత్నించారని టీడీపీ ఆరోపిస్తోంది.

First Published:  2 Dec 2022 3:37 AM GMT
Next Story