Telugu Global
Andhra Pradesh

రెబల్ ఎంపీకి తలంటిన కోర్టు

ఈ కేసులో ఇంప్లీడ్ పిటీషన్ వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని జడ్జి అడిగారు. అస‌లు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏమిటని ఎంపీని నిలదీశారు.

రెబల్ ఎంపీకి తలంటిన కోర్టు
X

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఏపీ హైకోర్టు గట్టిగా తలంటింది. స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి సీఐడీ చీఫ్ సంజయ్, అడిషినల్ అడ్వకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకరరెడ్డి మీడియా సమావేశాలు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) వేశారు. దానిపై కోర్టు సంజయ్, ఏఏజీకి నోటీసులు జారీ చేసింది.

ఇంతలోనే రెబల్ ఎంపీ రఘురాజు కూడా కోర్టులో పిటీషన్ వేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో తన వాదనలు కూడా వినాలంటూ ఇంప్లీడ్ పిటీషన్ వేశారు. కేసు విచారణలో భాగంగా తాను కూడా వాదనలు వినిపిస్తానని పిటీషన్లో ఎంపీ చెప్పారు. ఈ పిటీషన్ను విచారించిన జడ్జి తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో ఇంప్లీడ్ పిటీషన్ వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగారు. అస‌లు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏమిటని ఎంపీని నిలదీశారు. దానికి లాయర్ సమాధానం చెప్పలేకపోయారు.

ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తి ఎంపీ కాబట్టి ఇలాంటి పిటీషన్లను ఎంటర్ టైన్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే ఈ కేసుతో సంబంధం లేకపోయినా ఎంపీ వేసిన ఇంప్లీడ్ పిటీషన్ను ఆనుమతిస్తే ఇది చెడ్డ సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుందని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ పిటీషన్ను అనుమతిస్తే కేసు రాజకీయ రంగు పులుముకుంటుందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే మీడియా సమావేశాల్లో సంజయ్, పొన్నవోలు ఏమి మాట్లాడారో ఇంగ్లీషులోకి ట్రాన్స్ లేట్ చేసి తమకు ఇవ్వమని చెప్పినా ఎందుకు ఇవ్వలేదని సత్యనారాయణను కోర్టు నిలదీసింది.

సంజయ్, పొన్నవోలు సర్వీసు నిబంధనలు ఏమిటి? ఉల్లంఘనలు ఏమిటని పిటీషన‌ర్‌ను అడిగారు. దానికి పిటీషనర్ లాయర్ బదులిస్తూ సర్వీసు నిబంధనలను వివరించారు. సంజయ్, పొన్నవోలు పై ఎలాంటి చర్యలను కోరుకుంటున్నారని జడ్జి అడిగారు. అప్పుడు లాయర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో వీళ్ళిద్దరినీ మీడియా సమావేశాలు పెట్టకుండా, కేసు వివరాలను బహిర్గతం చేయకుండా ఆదేశించాలని కోరారు. దాంతో కేసు విచారణను వాయిదా వేసినట్లు జడ్జి ప్రకటించారు. మొత్తానికి సంబంధంలేని కేసులో ఇంప్లీడ్ పిటీషన్ వేసిన ఎంపీని కోర్టు గట్టిగానే తలంటింది.


First Published:  10 Nov 2023 4:57 AM GMT
Next Story