Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.. సుప్రీంకి వెళ్లే యోచనలో లాయర్లు

క్వాష్ పిటిషన్ విషయంలో సీఐడీ లాయర్లు చెప్పిన విషయాలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది.

చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.. సుప్రీంకి వెళ్లే యోచనలో లాయర్లు
X

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయాలని పెట్టిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. క్వాష్ పిటిషన్ విషయంలో సీఐడీ లాయర్లు చెప్పిన విషయాలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది.

క్వాష్ పిటిషన్‌కు సంబంధించి ఈ నెల 19న హైకోర్టులో ఒక రోజంతా వాదనలు జరిగాయి. సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, సిద్దార్థ్ అగ్రవాల్ వాదించగా.. సీఐడీ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. వాదనలు ఆ రోజే ముగించాలని హైకోర్టు జడ్జి చెప్పడంతో.. ఇరు పక్షాల లాయర్లు సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించారు.

చంద్రబాబుపై రాజకీయ కుట్రతో పెట్టిన కేసు అని ఆయన తరపు లాయర్లు వాదించారు. ఈ స్కిల్ స్కాంలో బాబు తప్పు చేశారనే ఒక్క సాక్ష్యం కూడా లేదని చెప్పారు. అరెస్టు కూడా తప్పుడు పద్దతిలో జరిగిందని, గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదని, అరెస్ట్ చేసే నాటికి ఎఫ్ఐఆర్‌లో పేరు కూడా లేదని వాదించారు. ప్రభుత్వం తరపున కూడా లాయర్లు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబే ఈ కేసులో ప్రధాన నిందితుడని కోర్టుకు చెప్పారు. స్కిల్ కాంట్రాక్ట్ పొందిన డిజైన్‌టెక్ సంస్థ.. సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చిందని.. అక్కడి నుంచి నిధులు దారి మళ్లించారని వాదించారు.

కాగా, మంగళవారం సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి తీర్పును రిజర్వ్ చేశారు. రెండు రోజుల తర్వాత క్వాష్ పిటిషన్‌పై తీర్పు చెబుతానని కేసు వాయిదా వేశారు. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు చెప్పారు. సీఐడీ లాయర్లు చెప్పిన దాంతో అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు వేసిన క్వాష్ రద్దు పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు 68 పేజీలతో కూడిన తీర్పును వెలువరించింది. ప్రస్తుతం దర్యాప్తు తుది దశలో ఉందని.. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు చెప్పింది. ఈ కేసులో అక్రమార్జనపై దర్యాప్తు జరగాల్సి ఉందని.. ఇలాంటి సమయంలో కోర్టులు జోక్యం చేసుకోవడం సబబు కాదని చెప్పింది. క్వాష్ పిటిషన్‌తో పాటు దీనికి అనుబంధంగా ఉన్న అన్ని పిటిషన్లను కొట్టేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.

కాగా, చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని లాయర్లు నిర్ణయించారు. సోమవారం సీఐడీ రిమాండ్ రిపోర్టుపై సుప్రీం తలుపులు తట్టనున్నారు. మరోవైపు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు కాసేపట్లో తీర్పు చెప్పనున్నది.

First Published:  22 Sep 2023 8:46 AM GMT
Next Story