Telugu Global
Andhra Pradesh

వాలంటీర్లు మంచి చేయడం లేదా, సీఎం ప్రసంగం చట్టవిరుద్ధమేమిటి?

వాలంటీర్‌ వ్యవస్థను జన్మభూమి కమిటీలతో పోల్చడానికి వీలు లేదంటారా అని హైకోర్టు పిటిషనర్‌ను నిలదీసింది. ‘సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం ద్వారా ప్రజలకు వాలంటీర్లు మంచి చేయడం లేదా? మంచి చేసినవాళ్లను సన్మానించకూడదా?’ అని అడిగింది.

వాలంటీర్లు మంచి చేయడం లేదా, సీఎం ప్రసంగం చట్టవిరుద్ధమేమిటి?
X

ముఖ్యమంత్రి తన ప్రసంగంలో గత ప్రభుత్వంలో ఏర్పాటైన జన్మభూమి కమిటీలతో ప్రస్తుతం తెచ్చిన వాలంటీర్‌ వ్యవస్థను పోల్చడాన్ని తాము ఎలా తప్పుపట్టగలమని హైకోర్టు ప్రశ్నించింది. పల్నాడు జిల్లాలో ఇటీవల నిర్వహించిన గ్రామ, వార్డు వాలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబును విమర్శిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన ప్రసంగాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) హైకోర్టు కొట్టేసింది. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడమేమిటని ప్రశ్నించింది.

వాలంటీర్‌ వ్యవస్థను జన్మభూమి కమిటీలతో పోల్చడానికి వీలు లేదంటారా అని హైకోర్టు పిటిషనర్‌ను నిలదీసింది. ‘సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం ద్వారా ప్రజలకు వాలంటీర్లు మంచి చేయడం లేదా? మంచి చేసినవాళ్లను సన్మానించకూడదా?’ అని అడిగింది. ఈ కార్యక్రమానికి ఖర్చు చేసిన సొమ్మును ముఖ్యమంత్రి నుంచి వసూలు చేయాలని ఎలా కోరుతారని కూడా ప్రశ్నించింది. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాలు పంచుకోవాలా, లేదా అనేది కేంద్ర ఎన్నిక ఎన్నికల సంఘం నిర్ణయించాలి తప్ప తాము కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అందులో జోక్యం చేసుకోలేమని చెప్పింది.

వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని సీఈసీ తరఫు న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ హైకోర్టుకు తెలిపారు. పోలింగ్‌ ఏజెంట్లుగా కూడా వ్యవహరించడానికి వీలు లేదని చెప్పినట్లు చెప్పారు. ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. వాలంటీర్ల విషయంలో ఈసీ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నందున ఈ వ్యాజ్యంలో విచారించడానికి ఏమీ లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పిల్‌ను కొట్టేసింది.

First Published:  14 March 2024 5:01 AM GMT
Next Story