Telugu Global
Andhra Pradesh

ఇకపై ఇది సామాజిక అమరావతి.. ఇళ్ల పట్టాల పంపిణీ సభలో సీఎం వైఎస్ జగన్

దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేసి విజయం సాధించామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇది పేదల విజయమని జగన్ అభివర్ణించారు.

ఇకపై ఇది సామాజిక అమరావతి.. ఇళ్ల పట్టాల పంపిణీ సభలో సీఎం వైఎస్ జగన్
X

అమరావతి ప్రాంతం.. ఇకపై సామాజిక అమరావతిగా మారిపోనున్నదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం వెంకటపాలెంలో 'నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆర్-5 జోన్‌లో ఏర్పాటు చేసిన 50,793 ప్లాట్లకు సంబంధించిన పత్రాలను లబ్దిదారులకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే రూ.443.71 కోట్లతో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్దిదారులకు అప్పగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..

దేశ చరిత్రలోనే ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. కొంత మంది కుట్రలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వమే పేదల కోసం సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేసింది. చివరకు దేశ అత్యున్నత న్యాయ స్థానంలో విజయం సాధించామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఇది పేదల విజయమని.. ఇకపై అమరావతి సామాజిక అమరావతిగా మారిపోతుందని జగన్ అభివర్ణించారు. ఇది మనందరి అమరావతి అని ఉద్ఘాటించారు.

ఇక్కడ అందిస్తున్న ఇంటి స్థలాలను అక్కచెల్లెళ్ల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేస్తాము. ఒక్కో స్థలం విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ పలుకుతుందని చెప్పారు. సీఆర్డీయే పరిధిలోని 1402.58 ఎకరాల్లో 25 లేఅవుట్లు సిద్ధం చేశాము. ఈ రోజు దాదాపు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల విలువైన సంపదను అక్కచెల్లెమ్మలకు బదిలీ చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.

ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లలో ఇళ్లు కట్టుకోవడానికి మూడు ఆప్షన్లు ఇస్తామని చెప్పారు. సొంతగా ఇళ్లు కట్టుకుంటామంటే రూ.1,80,000 లబ్దిదారుల అకౌంట్‌లో జమ చేస్తాము. రెండో ఆప్షన్‌లో కూలీ మొత్తాన్ని జమ చేస్తాము. దీంతో పాటు ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుందని.. స్టీల్, సిమెంట్, డోర్ ఫ్రేమ్‌లు సబ్సిడీపై సరఫరా చేస్తామని చెప్పారు. ప్రభుత్వం అందించే మెటీరియల్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడబోమని సీఎం జగన్ స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా.. జూలై 8 నుంచి ఇళ్లు కట్టించే కార్యక్రమం మొదలవుతుందని అన్నారు.

ఇప్పటికే అన్ని లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తి చేశామని, జూలై 8వ తేదీలోగా జియో ట్యాగింగ్ కూడా పూర్తి చేస్తామని సీఎం చెప్పారు. వారం రోజుల పాటు ఇళ్ల పట్టాల పండుగ కార్యక్రమం ఉంటుందని, ఆ వారంలోనే ఇళ్లు కట్టడానికి పునాది కూడా పడుతుందని సీఎం స్పష్టం చేశారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలను మోసం చేశారు. ఎన్నికలు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు మొదలు పెడతారు. అలాంటి మోసకారిని ప్రజలు నమ్మవద్దని సీఎం జగన్ కోరారు. నరకాసురుడిని అయినా నమ్మొచ్చు కానీ.. నారా చంద్రబాబును మాత్రం నమ్మ వద్దని చెప్పారు. అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 వరకు ఒక్క పట్టా కూడా చంద్రబాబు ఇవ్వలేదని చెప్పారు.

పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశామని వైఎస్ జగన్ అన్నారు. మేనిఫెస్టోను మేము భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లాగా భావిస్తామని చెప్పారు. నాలుగేళ్లలో ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. డీబీటీ ద్వారా రూ.2.11 లక్షలను నేరుగా లబ్దిదారులకు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ కష్టకాలంలో కూడా ఎక్కడా రాజీ పడలేదని.. అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం పని చేశామని అన్నారు. కోవిడ్ సమయంలో కూడా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు చెప్పారు.


First Published:  26 May 2023 6:39 AM GMT
Next Story