Telugu Global
Andhra Pradesh

కొండ నిండినది.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవ టికెట్ల దర్శనాలను నియంత్రించామని చెప్పారు చైర్మన్ భూమన. క్యూలైన్లలో వేచి ఉన్నవారికి త్వరగా శ్రీవారి దర్శనం అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు.

కొండ నిండినది.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు
X

వరుస సెలవలతో తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. పెరటాసి మాసం సందర్భంగా తమిళనాడు భక్తులు కూడా తిరుమలకు పోటెత్తారు. దీంతో క్యూలైన్లు కిలోమీటర్ల మేర పెరిగిపోయాయి. తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి క్యూలైన్లను పరిశీలించారు. భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సంయమనం పాటించాలి..

కొండపై విపరీతమైన రద్దీ ఉందని, భక్తులు సంయమనం పాటించాలని కోరారు చైర్మన్ భూమన. వేచి ఉండే సమయం ఎక్కువగా ఉంటుందని, భక్తులు మానసికంగా సిద్ధం కావాలన్నారు. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు, శిలాతోరణం మార్గంలో ఉన్న క్యూలైన్స్, గోగర్భం డ్యాం వరకు ఉన్న క్యూలైన్స్ లో భక్తులతో ఆయన మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుతున్నారు.

టీటీడీ నిరంతర చర్యలు..

క్యూలైన్లో ఉన్న భక్తులకు ఆహారం, నీరు, పాలు అందించేందుకు టీటీడీ నిరంతరం చర్యలు చేపట్టిందని అన్నారు చైర్మన్ భూమన. కేవలం షెడ్లలో ఉండేవారికే కాకుండా క్యూలైన్లలో నిలబడి ఉన్నవారికి కూడా ఆహారం అందిస్తున్నామని చెప్పారు. పారిశుధ్య నిర్వహణకు కూడా టీటీడీ తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఏ ఒక్క భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు దగ్గరుండి సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు.

వీఐపీ దర్శనాలపై ఆంక్షలు..

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవ టికెట్ల దర్శనాలను నియంత్రించామని చెప్పారు చైర్మన్ భూమన. క్యూలైన్లలో వేచి ఉన్నవారికి త్వరగా శ్రీవారి దర్శనం అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. భక్తుల భధ్రత, సౌకర్యాల పట్ల టీటీడీ జాగ్రత్తగా వ్యవహరిస్తోందన్నారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలపై ఉన్న నియంత్రణ పూర్తిగా తొలగించామని చెప్పారు భూమన. నడకదారి భక్తులకు మరింత భధ్రత కల్పిస్తామని అన్నారు. అలిపిరిలో ఎలాంటి అపాయం లేదని అటవీ శాఖా అధికారులు చెప్పే వరకు నడక మార్గంలో ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు భూమన.

First Published:  2 Oct 2023 10:15 AM GMT
Next Story