Telugu Global
Andhra Pradesh

క‌రువు సీమ‌లో వ‌రద క‌ష్టాలు - అనంత‌పురంలో ముంచెత్తిన వ‌ర‌ద‌

బుధ‌వారం కురిసిన వ‌ర్షానికి అనంత‌పురంలో 15 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఒక్క‌సారిగా వ‌ర‌ద పెర‌గ‌డంతో చెరువులు తెగిపోవ‌డంతో ముంపు ఏర్ప‌డింది. శివారు, లోత‌ట్టు ప్రాంతాల్లో కాకుండా.. ఏకంగా న‌గ‌రం మ‌ధ్య‌లోనే ముంపు క‌ష్టాలు రావ‌డం గ‌మ‌నార్హం.

క‌రువు సీమ‌లో వ‌రద క‌ష్టాలు  - అనంత‌పురంలో ముంచెత్తిన వ‌ర‌ద‌
X

క‌రువు సీమలో వ‌ర‌ద బీభ‌త్సం సృష్టిస్తోంది. వీధులు వాగుల‌య్యాయి.. రోడ్లు కాలువ‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. కాల‌నీలు చెరువుల్లా మారాయి. అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో రెండు రోజుల త‌ర‌బ‌డి కురుస్తున్న వ‌ర్షాల‌కు అనంత‌పురంలో వ‌ర‌ద అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. వ‌ర‌ద ప్ర‌భావానికి వాహ‌నాలు, కంటెయినర్లు సైతం కొట్టుకుపోతున్నాయంటే అక్క‌డ ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా వ‌ర‌ద ప్ర‌భావంతో వాగులు పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. అనంత‌పురం న‌గ‌రంలో ఎన్న‌డూ లేని విధంగా ముంచెత్తిన వ‌ర‌ద‌ల‌తో జ‌నం అల్లాడిపోతున్నారు.

బుధ‌వారం కురిసిన వ‌ర్షానికి అనంత‌పురంలో 15 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఒక్క‌సారిగా వ‌ర‌ద పెర‌గ‌డంతో చెరువులు తెగిపోవ‌డంతో ముంపు ఏర్ప‌డింది. శివారు, లోత‌ట్టు ప్రాంతాల్లో కాకుండా.. ఏకంగా న‌గ‌రం మ‌ధ్య‌లోనే ముంపు క‌ష్టాలు రావ‌డం గ‌మ‌నార్హం. మూడు రోజులుగా ఈ వ‌ర‌ద ముంపులో ప్ర‌జ‌లు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. వంద‌ల కొద్దీ ఇళ్లు ముంపులో ఉన్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రింత వ‌ర‌ద ముంచుకొచ్చే అవ‌కాశ‌ముంద‌ని అధికారులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ముమ్మ‌ర స‌హాయ కార్య‌క్ర‌మాల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. స‌గం ప‌ట్ట‌ణానికి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల్లో చెరువులో తెగిపోయే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని అధికారులు అల‌ర్ట్ చేస్తున్నారు. ముంపు ప్రాంత ప్ర‌జ‌ల‌కు స‌హాయ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ముంపు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. బోట్ల ద్వారా బాధితుల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు. అనంత‌పురంలో వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మీక్షించారు. బాధిత కుటుంబాల‌కు త‌క్ష‌ణ సాయంగా రూ.2 వేల చొప్పున ప్ర‌క‌టించారు.

First Published:  13 Oct 2022 8:49 AM GMT
Next Story