Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని ఆయన తరపు లాయర్లు వాదించారు.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
X

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో తనపై నమోదైన రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని ఆయన తరపు లాయర్లు వాదించారు. రిమాండ్ రిపోర్టులో నేరం జరిగిన తేదీని పరిగణలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 2014 నుంచి 2019 మధ్య స్కామ్ జరిగిందని ఆరోపించారు. కానీ ఏడాది తర్వాత కేసు నమోదు చేశారని చంద్రబాబు తరపు లాయర్ అభిషేక్ సింఘ్వీ వాదించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని బాబు తరుపు లాయర్లు వాదించారు.

కేబినెట్ నిర్ణయాలు సీఎం ఒక్కరే బాధ్యులు కాలేరని.. ఆ నిర్ణయాలు అధికార నిర్వహణలో భాగమని సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకొని వెళ్లారు. యశ్వంత్ సిన్హా కేసులో కోర్టు తీర్పు ఈ కేసుకు కచ్చితంగా వర్తిస్తుందని బాబు లాయర్లు గట్టిగా వాదించారు. ట్రాప్ కేసు తప్ప మిగిలిన 6 రకాల ఆరోపణలకు 17ఏ వర్తిస్తుందని చెప్పారు. రాజకీయ ప్రతీకారం కోసమే 17ఏ తీసుకొని వచ్చారు. ఈ కేసులో సెక్షన్ వర్తిస్తుందా లేదా అనేదే ప్రధానమని హరీశ్ సాల్వే వాదించారు. ఆరోపణలు ఎప్పటివి అనేది కాదని.. కేసు నమోదు ఎప్పుడు జరిగింది, విచారణ ఎప్పుడు ప్రారంభమయ్యిందనేనే ప్రధాన అంశమని అన్నారు.

ఇక ప్రభుత్వం తరపున సీఐడీ లాయర్లు కూడా గట్టిగా వాదించారు. చంద్రబాబుకు ఈ కేసులో 17ఏ వర్తించదని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టు అయిన మూడు రోజుల్లోనే క్వాష్ పిటిషన్ వేశారు. వీళ్లు కనీసం బెయిల్ అడగటం లేదు. ఏకంగా కేసునే కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారని ముకుల్ రోహత్గీ వాదించారు. ఏకంగా 2వేల పేజీల పిటిషన్‌ను హైకోర్టు ముందు ఉంచారు. ఈ కేసు దర్యాప్తు 2017 కంటే ముందే మొదలయ్యింది. అప్పుడే దీన్ని సీబీఐ పరిశీలించింది. ఇక దీన్ని రాజకీయ కక్ష అని ఎలా అంటారని ముకుల్ రోహత్గీ ధర్మాసనం దృష్టికి తీసుకొని వచ్చారు. 2015-16లో ప్రస్తుత ప్రభుత్వం రాకముందే దర్యాప్తు మొదలైతే ఇక రాజకీయ కక్ష సాధింపు ఎక్కడ ఉందని అన్నారు.

కాగా, సోమవారం లోగా ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలని చంద్రబాబు తరపు లాయర్లకు సూచించింది. అనంతరం ఈ కేసు విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది.

First Published:  3 Oct 2023 8:24 AM GMT
Next Story