Telugu Global
Andhra Pradesh

ఎన్టీఆర్ ప్లేస్‌లో వైఎస్సార్.. జగన్ లాజిక్ ఏంటంటే..?

ఏపీకి సంబంధించి 28 మెడికల్‌ కాలేజీల్లో 20 కాలేజీలు వైఎస్సార్‌, వైఎస్సార్ కొడుకైన తన హయాంలోనే వచ్చాయని.. అలాంటప్పుడు వైఎస్సార్‌ పేరు పెట్టకూడదనడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. అర్హత దక్కాల్సిన వాళ్లకు క్రెడిట్‌ ఇవ్వకపోవడం ధర్మమేనా? అని నిలదీశారు జగన్.

ఎన్టీఆర్ ప్లేస్‌లో వైఎస్సార్.. జగన్ లాజిక్ ఏంటంటే..?
X

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా మారిపోతోంది. అయితే ఇప్పుడే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు. అసలు ఎన్టీఆర్ పేరు మార్చడం ఎందుకు..? హెల్త్ వర్శిటీ స్థాపనకు కృషిచేసిన ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టడంలో లాజిక్ ఏంటి..? అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఎన్టీఆర్ పేరు మార్పు విషయంలో టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ దశలో వైసీపీ నుంచి వివరణలు వినపడ్డాయి. అందరూ ఆరోగ్యశ్రీ, 108, 104 పేర్లు ప్రస్తావించారు. ఆరోగ్యశ్రీకి ఆద్యుడు వైఎస్ఆర్ అని, 104, 108 కూడా ఆయన హయాంలోనే ప్రవేశపెట్టారని లాజిక్ తీశారు. ఇంత చేసిన వైఎస్ఆర్ పేరు పెట్టకుండా ఎన్టీఆర్ పేరు ఎలా కొనసాగిస్తామన్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ కి ద్రోహం చేసింది చంద్రబాబేనని విమర్శించారు వైసీపీ నేతలు.

జగన్ లాజిక్ ఏంటంటే..?

తాజాగా అసెంబ్లీలో పేరు మార్పు వ్యవహారంపై వివరణ ఇచ్చారు సీఎం జగన్. ఎన్టీఆర్ అంటే తనకెంతో గౌరవం అని, ఒకరకంగా చంద్రబాబుకంటే తానే ఎక్కువగా ఎన్టీఆర్ ని గౌరవిస్తానని చెప్పారు. తానెప్పుడూ ఆయనకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అగౌరవ పరిచే కార్యక్రమం కూడా చేపట్టలేదన్నారు. పాదయాత్రలో హామీ ఇచ్చినట్టుగానే కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టామని గుర్తుచేశారు. పేరు మార్చడానికి అసలు కారణం ఏంటో కూడా వివరించారు సీఎం జగన్.

కాలేజీల ఘనత ఎవరిది..?

హెల్త్ యూనివర్శిటీ స్థాపించింది ఎన్టీఆరే కానీ.. ఏపీకి వైద్య కళాశాలకు తెచ్చిన ఘనత మాత్రం మా తండ్రీకొడుకులదేనన్నారు సీఎం జగన్. తన తండ్రి హయాంలో, తన హయాంలోనే ఏపీలో ఎక్కువ మెడికల్ కాలేజీలు వచ్చాయని చెప్పారు. ఏపీలో ఉన్న 11 మెడికల్‌ కాలేజీలలో ఎనిమిది కాలేజీలు.. టీడీపీ ఆవిర్భావం కంటే ముందే ఉన్నాయని గుర్తు చేశారు జగన్. 1983 నుంచి ఈరోజువరకు టీడీపీ చరిత్రలో ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా తీసుకు రాలేదన్నారు. ఆ తర్వాత మూడు మెడికల్‌ కాలేజీలు వైఎస్సార్‌ హయాంలో వచ్చాయన్నారు. ప్రస్తుతం మరో 17 మెడికల్‌ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని, మొత్తంగా ఏపీకి సంబంధించి 28 మెడికల్‌ కాలేజీల్లో 20 కాలేజీలు వైఎస్సార్‌, వైఎస్సార్ కొడుకైన తన హయాంలోనే వచ్చాయని.. అలాంటప్పుడు వైఎస్సార్‌ పేరు పెట్టకూడదనడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. అర్హత దక్కాల్సిన వాళ్లకు క్రెడిట్‌ ఇవ్వకపోవడం ధర్మమేనా? అని నిలదీశారు జగన్.

టీడీపీ హయాంలో ఏదైనా కట్టి ఉంటే.. దానికి ఎన్టీఆర్‌ పేరు పెట్టమని వాళ్లు అడిగితే సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు జగన్. బాగా ఆలోచించే ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

First Published:  21 Sep 2022 9:09 AM GMT
Next Story