Telugu Global
Andhra Pradesh

జడ్జికి వాచ్ కథ... ఇప్పుడు నీతిమంతుడయ్యాడా, రాధాకృష్ణా?

వేమిరెడ్డి ఆర్థికంగా చాలా బలమైనవాడు. అందుకే, చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చారు. టీడీపీలో చేరగానే వేమిరెడ్డికి వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో వార్తాకథనాలు ఆగిపోయాయి.

జడ్జికి వాచ్ కథ... ఇప్పుడు నీతిమంతుడయ్యాడా, రాధాకృష్ణా?
X

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరగానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు నీతిమంతుడిగా కనిపిస్తున్నట్లున్నారు. ఆయన వైఎస్సార్ సీపీలో ఉన్నప్పుడు ఓ వార్తాకథనాన్ని అల్లి, దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కూడా అంటగట్టారు. ఆంధ్రజ్యోతి వార్తాకథనం సారాంశం ఏమిటంటే.. వేమిరెడ్డి ఎప్పుడో ఒకనాడు ఇండోర్ లోని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇంటిలో జరిగిన పెళ్లికి వెళ్లారు. రెండు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాల వాచ్ తీసుకుని ఆయన అక్కడికి వెళ్లారు. దాన్ని న్యాయమూర్తి తీసుకోలేదు. జగన్ తరఫునే వేమిరెడ్డి అక్కడికి వెళ్లి ఆ వజ్రాల వాచ్ ను ఇవ్వడానికి సిద్ధపడ్దాడని, న్యాయమూర్తి చీవాట్లు పెట్టారని ఆంధ్రజ్యోతి రాసింది.

చంద్రబాబు కొమ్ము కాస్తూ జగన్ ను దెబ్బ తీయాలనే రాధాకృష్ణ అలా కాకుండా మరోలా రాయడు కదా అని సరిపుచ్చుకోవచ్చు. అయితే, ఇప్పుడు వేమిరెడ్డి టీడీపీలో చేరారు. దానికి ముందు ఆయన వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేయాలని ఆయనకు జగన్ సూచించారు. ఆయన కూడా సిద్ధపడ్డారు. కానీ తన భార్యకు కూడా టికెట్ ఇవ్వాలని వేమిరెడ్డి కోరారు. అందుకు జగన్ నిరాకరించారు. దీంతో ఆయన జగన్ మీద అలక వహించారు.

ఆయనను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. వేమిరెడ్డి దంపతులిద్దరికీ బాబు టికెట్లు ఇచ్చారు. వేమిరెడ్డి నెల్లూరు లోకసభ స్థానానికి, ఆయన భార్య ప్రశాంతి కోవూరు శాసనసభా స్థానానికి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వేమిరెడ్డి ఆర్థికంగా చాలా బలమైనవాడు. అందుకే, చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చారు. టీడీపీలో చేరగానే వేమిరెడ్డికి వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో వార్తాకథనాలు ఆగిపోయాయి.

చంద్రబాబు ప్రమేయంతోనే ఆంధ్రజ్యోతిలో జగన్‌కు అంటగడుతూ వేమిరెడ్డిపై వార్తాకథనం వచ్చిందనేది వేరుగా చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తారు. చంద్రబాబుకు అనుగుణంగానే ఎల్లో మీడియా వార్తాకథనాలు ప్రచురిస్తుంది.

First Published:  10 April 2024 12:25 PM GMT
Next Story