Telugu Global
Andhra Pradesh

జగన్ క్లియర్ మెసేజ్ ఇచ్చేశారా..?

సరిగ్గా ఈ సందర్భంలోనే పార్టీని వదిలిపెట్టదలచుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చని జగన్ చెప్పేశారట. నియోజకవర్గాల్లో అన్నీ కోణాల్లో ఒకటికి రెండు మూడుసార్లు సర్వేలు చేయించుకున్న తర్వాతే టికెట్లపై నిర్ణయం తీసుకున్నట్లు జగన్ చెబుతున్నారు.

జగన్ క్లియర్ మెసేజ్ ఇచ్చేశారా..?
X

పార్టీలోని అసంతృప్తులకు జగన్మోహన్ రెడ్డి క్లియర్ మెసేజ్ ఇచ్చేశారు. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లకు 175 గెలవాలన్నది జగన్ టార్గెట్. ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. అయితే 175 సీట్లూ గెలవాలన్న పట్టుదలతోనే జగన్ మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టికెట్లు ఇవ్వనని చెప్పేస్తున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల‌ నియోజకవర్గాలను మార్చుతున్నారు. మరికొందరిని ఎంపీలుగా పోటీచేయమని చెబుతున్నారు.

వచ్చేఎన్నికల్లో టికెట్లు ఇవ్వనని చెబుతున్న సిట్టింగులకు న్యాయం చేస్తానని జగన్ హామీ ఇస్తున్నారు. అయితే కొందరు వైసీపీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్ళటానికి ప్లాన్ చేస్తున్నారు. ఉన్న పార్టీలో టికెట్ దక్కదని ఖాయమైన తర్వాత ఏదో పార్టీలో చేరి టికెట్ తెచ్చుకుని పోటీలో చేయాలని నేతలు అనుకోవటం అత్యంత సహజం. ఇప్పుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరటానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వైజాగ్ లో ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఇంకా ఎంతమంది పార్టీని వదిలేస్తారో తెలీదు.

సరిగ్గా ఈ సందర్భంలోనే పార్టీని వదిలిపెట్టదలచుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చని జగన్ చెప్పేశారట. నియోజకవర్గాల్లో అన్నీ కోణాల్లో ఒకటికి రెండు మూడుసార్లు సర్వేలు చేయించుకున్న తర్వాతే టికెట్లపై నిర్ణయం తీసుకున్నట్లు జగన్ చెబుతున్నారు. తన నిర్ణయం నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీని వదిలేయచ్చని చెప్పేశారు. జగన్ కు ప్లస్ ఇదే, మైనస్సూ ఇదే. వెళ్ళదలచుకున్న నేతలను ఉండమని బతిమిలాడరు, పార్టీలోకి రాదలచుకున్న నేతలను వద్దనిచెప్పరు.

తాజా నిర్ణయం నేపథ్యంలో జరగబోయేది ఏమిటంటే.. పార్టీకి రాజీనామా చేస్తామని అంటే జగన్ బతిమలాడుకుంటాడేమో అని అనుకున్న సిట్టింగులకు క్లియర్ మెసేజ్ వచ్చేసినట్లే. టికెట్ దక్కకపోయినా పార్టీలో ఉండి అభ్యర్థుల గెలుపున‌కు కష్టపడాలని జగన్ చెబుతున్నారు. కాదు కూడదంటే పార్టీ నుంచి వెళ్ళిపొమ్మంటున్నారు. ఇదే విషయాన్ని సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల మీడియాతో చెప్పారు. అంటే పార్టీలో ఉండాలా..? వెళ్ళిపోవాలా..? అన్న నిర్ణయం తీసుకోవాల్సింది జగన్ నిర్ణయంతో విభేదించేవాళ్ళే.

First Published:  29 Dec 2023 5:05 AM GMT
Next Story