Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ఇంతగా దిగజారిపోయారా..?

సినిమా గురించి తెలిసే విడుదల కాకుండా జగన్ తీవ్రంగా అడ్డుకున్నాడట. అయితే కోర్టు జగన్ ఆటలు సాగనివ్వలేదట. తెలుగు ప్రజలందరూ థియేటర్లకు వెళ్ళి సినిమాను చూడాలని, వాస్తవాలను తెలుసుకోవాలని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు ఇంతగా దిగజారిపోయారా..?
X

చివరకు చంద్రబాబునాయుడు పరిస్థితి ఎంతకు దిగజారిపోయిందంటే సినిమా ప్రమోషన్లు చేసేస్థాయికి పడిపోయింది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ స్పాన్సర్డ్ సినిమాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘రాజధాని ఫైల్స్’ ను ప్రతి ఒక్కరూ చూడాలని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పిలుపునిచ్చారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు సినిమా ప్రమోషన్ చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని ప్రాంతంపై ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పగబట్టి అమరావతిని సర్వనాశనం చేశాడట. కులాల కుంపట్ల రాజేసి, విష ప్రచారం చేయించాడట.

అధికారబలం మొత్తాన్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేశాడట. జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన ఒక రాజధానిని, త్యాగాలుచేసిన ఎంతోమంది కష్టాలను రాజధాని ఫైల్స్ కళ్ళకు కట్టిందట. సినిమా గురించి తెలిసే విడుదల కాకుండా జగన్ తీవ్రంగా అడ్డుకున్నాడట. అయితే కోర్టు జగన్ ఆటలు సాగనివ్వలేదట. తెలుగు ప్రజలందరూ థియేటర్లకు వెళ్ళి సినిమాను చూడాలని, వాస్తవాలను తెలుసుకోవాలని చంద్రబాబు చెప్పారు. దీనికి ట్యాగ్ లైన్ ఏమిటంటే.. ‘జగన్ రెడ్డీ నీ సినిమా అయిపోయింది.. అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది’ అని చంద్రబాబు చెప్పటమే.

సరే.. చంద్రబాబుకు అనుకూలంగా, జగన్ కు వ్యతిరేకంగా తీసిన లేదా తీయించారు కాబట్టి ఈ సినిమా ఎలాగుంటుందనే చర్చ అవసరంలేదు. ఇక్కడ డైరెక్టరయినా, నిర్మాతైనా మరచిపోయిన విషయం ఏమిటంటే రాజధాని రైతులు భూములు ఇచ్చి త్యాగాలు చేశారని సీమాంధ్రలోని మిగిలిన జిల్లాల జనాలెవరు అనుకోవటంలేదు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులది ఫక్తు వ్యాపారమని, అత్యాశ‌నే ఇప్పటికీ అనుకుంటున్నారు. అందుకనే రైతుల పేరుతో జరుగుతున్న ఆందోళనకు మిగిలిన జిల్లాలు వదిలేస్తే రాజధాని జిల్లాల్లోని జనాలే మద్దతివ్వలేదు.

రాజధాని రైతులు కూడా తమ భూముల విలువ పెరుగుతుందనే తాము భూములిచ్చినట్లు పదేపదే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. త్యాగానికి-వ్యాపారానికి చంద్రబాబుకు అంతమాత్రం తేడా తెలీదా? ప్రతిఫలం ఆశించకుండా భూములు ఇవ్వటాన్ని త్యాగమంటారు. అంతేకానీ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసుకుని, రైతుల భూములు తీసుకుని అందుకు విలువైన స్ధలాలు ఇవ్వటం, ప్రతి ఏడాది కౌలు తీసుకోవటం త్యాగాలు ఎలాగవుతుంది..? అందులోని విషయమంతా తెలుసు కాబట్టే సినిమాను జనాలెవరూ చూడటంలేదు. అందుకనే చంద్రబాబు స్వయంగా సినిమా ప్రమోషన్ కు దిగారు.

First Published:  17 Feb 2024 7:12 AM GMT
Next Story