Telugu Global
Andhra Pradesh

ఈ 8 సీట్లపైనే బీజేపీ 'టార్గెట్' పెట్టిందా..?

పార్టీ తరపున ఏపీ నుండి వెంకయ్యనాయుడు లాంటి చెప్పుకోదగ్గ నేతలే ఉన్నప్పటికీ పార్టీకి మాత్రం పట్టుదొరకలేదు. వెంకయ్య అయినా మరోనేతైనా పార్టీ వల్ల తాము లాభపడ్డారే కానీ పార్టీకి జరిగిన మేలు ఏమీలేదు.

ఈ 8 సీట్లపైనే బీజేపీ టార్గెట్ పెట్టిందా..?
X

వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎలాగైనా కొన్నిసీట్లలో పాగావేయాలన్నది బీజేపీ నేతల పట్టుదల. ఒంటరిగా పోటీచేస్తే ఆ టార్గెట్ ఎప్పటికీ రీచ్ అవ్వమని వాళ్ళకు బాగా తెలుసు. అందుకనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పట్టుకుని ఊగుతున్నారు. మరి పవన్ సహకారంతో అయినా వాళ్ళ టార్గెట్ రీచవుతారా అంటే ఆ విషయాన్ని ఇప్పుడే ఎవరు చెప్పలేరు. అయితే తమ ఆలోచనలకు తగ్గట్లుగానే గ్రౌండ్ లెవల్లో వర్కవుట్ చేస్తున్నారు.

బీజేపీ ఫోకస్ అంతా 8 పార్లమెంటు సీట్లపైనే ఉంచింది. ఇంతకీ ఆ సీట్లు ఏవంటే విశాఖపట్నం, అనకాపల్లి, నరసాపురం, కాకినాడ, గుంటూరు, నరసరావుపేట, తిరుపతి, మచిలీపట్నం, విజయవాడ. టార్గెట్ పెట్టుకోవటం ఏముంది పార్టీ ఇష్టం కానీ అది వాస్తవంలోకి రావటం అంటే జనాల ఆదరణ లేకపోతే సాధ్యంకాదు. మరి పార్టీకి జనాల్లో అంతటి ఆదరణుందా..? అని ఆలోచిస్తే కొన్ని విషయాల్లో బోధపడతాయి. ఇంతకీ అవేమిటంటే బీజేపీకి మొదటినుండి ఏపీలో అసలు పట్టేలేదు.

పార్టీ తరపున ఏపీ నుండి వెంకయ్యనాయుడు లాంటి చెప్పుకోదగ్గ నేతలే ఉన్నప్పటికీ పార్టీకి మాత్రం పట్టుదొరకలేదు. వెంకయ్య అయినా మరోనేతైనా పార్టీ వల్ల తాము లాభపడ్డారే కానీ పార్టీకి జరిగిన మేలు ఏమీలేదు. పైగా చాలాకాలం టీడీపీతో అంటకాగటం వల్ల బీజేపీని తోకపార్టీగా మార్చేశారు. గతంలో నరసాపురం, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం పార్లమెంటు సీట్లలో గెలిచినా అదంతా గాలిలోనే సాధ్యమైంది. దేశవ్యాప్తంగా పార్టీకి ఏదన్నా గాలుంటే మాత్రమే నాలుగు సీట్లలో గెలుస్తోంది. మిగిలిన ఎన్నికలను చూస్తే కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోతోంది.

మరి రేపటి ఎన్నికల్లో ఏకంగా 8 పార్లమెంటు సీట్లతో పాటు దానిపరిధిలోని అసెంబ్లీలపై ఎలా గెలవాలని అనుకుంటోందో అర్థంకావటంలేదు. ఈమధ్యనే రాజమండ్రిలో జరిగిన కమలనాధుల కీలక సమావేశంలో పై టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు. ఇందుకు అనుగుణంగానే పై నియోజకవర్గాల్లో సోషల్ మీడియాను బాగా యాక్టివ్ చేయాలని కూడా అనుకున్నారు. ఒంటరిగానే పోటీచేస్తారా..? లేకపోతే ఎవరితో అయినా పొత్తుల్లో వెళతారా అన్నదే తేల్చుకోలేని బీజేపీ 8 పార్లమెంటు సీట్లను టార్గెట్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

First Published:  5 Dec 2022 5:06 AM GMT
Next Story