Telugu Global
Andhra Pradesh

ఇది శాంపిల్‌ మాత్రమే.. అసలు కథ అసెంబ్లీలో చెప్తా - హరీష్‌ రావు

రెండో KRMB సమావేశం ముగిసిన తర్వాత ఏపీ, తెలంగాణ ENCలు ఏం మాట్లాడారనే వీడియోలను ప్రదర్శించారు హరీష్ రావు. ఇద్దరు ఈఎన్సీలు ప్రాజెక్టులు, ఉద్యోగులను అప్పజెప్పుతామని చెప్పారని స్పష్టంగా వీడియోలో చెప్పారన్నారు.

ఇది శాంపిల్‌ మాత్రమే.. అసలు కథ అసెంబ్లీలో చెప్తా - హరీష్‌ రావు
X

కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు ప్రాజెక్టులను కేసీఆరే అప్పగించాడంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ఎవరెన్ని చెప్పినా పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను KRMBకి ప్రాజెక్టులు అప్పజెప్పలేదన్నారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అవగాహన రాహిత్యంతో.. తొందరపాటుగా తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్కుతినే పరిస్థితి తెచ్చారన్నారు. ఇది రేవంత్‌ సర్కార్ ఫెయిల్యూర్‌ కాదా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ తన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు అబద్ధాలు మాట్లాడుతూ ఎదురుదాడి చేస్తోందన్నారు.


రెండో KRMB సమావేశం ముగిసిన తర్వాత ఏపీ, తెలంగాణ ENCలు ఏం మాట్లాడారనే వీడియోలను ప్రదర్శించారు హరీష్ రావు. ఇద్దరు ఈఎన్సీలు ప్రాజెక్టులు, ఉద్యోగులను అప్పజెప్పుతామని చెప్పారని స్పష్టంగా వీడియోలో చెప్పారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అవాస్తవాలు చెప్పారని, భవిష్యత్తులో రేవంత్ కామెంట్స్‌ను మీడియా చెక్‌ చేసుకుని రాసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.


ఇక పోతిరెడ్డిపాడును వైఎస్సార్ స్టార్ట్ చేసినప్పుడు హరీష్‌, నాయిని నర్సింహారెడ్డి మంత్రులుగా ఉన్నారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు తప్పు పట్టారు. రేవంత్‌కు స్క్రిప్ట్‌ రైటర్లు సరిగ్గా లేరని, ఆయన బ్యాక్ ఆఫీస్‌ సరి చేసుకోవాలని సూచించారు హరీష్ రావు. తెలంగాణ కోసం ఏడాది కాలంలోనే మంత్రి పదవులు వదులుకున్నామన్నారు. ఆనాడు పదవుల కోసం పెదవులు మూసుకుంది రేవంత్‌ రెడ్డేనని ఆరోపించారు హరీష్‌ రావు.


విభజన బిల్లును రూపొందించింది అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు హరీష్ రావు. ఈ విషయం రేవంత్‌కు తెలిసే అవకాశం లేదని, ఎందుకంటే ఆయన ఆనాడు ఉద్యమంలో లేడని, అటు కాంగ్రెస్‌ పార్టీలోనూ లేడన్నారు. ఆనాడు రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేస్తుంటే ఆ దీక్షలో రేవంత్ కూర్చున్నాడని హరీష్‌ గుర్తుచేశారు. ఇది శాంపిల్ మాత్రమేనని.. అసలు కథ అసెంబ్లీలో చెప్తామన్నారు హరీష్ రావు.

First Published:  5 Feb 2024 12:16 PM GMT
Next Story