Telugu Global
Andhra Pradesh

పవన్నే ఇరుకునపడేశారా?

నీతివంతమైన పాలన అందిస్తానని చెబుతున్న పవన్, టీడీపీ అధినేతపై జగన్ చేసిన ఆరోపణలపై స్పందించకపోతే రాంగ్ సిగ్నల్ వెళుతుంది జోగయ్య అన్నారు. ఆరోపణలు నిరూపితమైతే టీడీపీతో పవన్ ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు.

పవన్నే ఇరుకునపడేశారా?
X

కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేశారా? తాజాగా జోగయ్య విడుదల చేసిన లేఖ అలాగే ఉంది. విషయం ఏమిటంటే స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు నాయుడు రూ.370 కోట్ల అవినీతికి పాల్పడినట్లు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే ఆరోపణలు చేశారు. తనవి కేవలం ఆరోపణలు మాత్రమే కావన్న జగన్ అందుకు ఆధారాలను కూడా సభ ముందుంచారు. జగన్ చేసిన ఆరోపణలు, చూపించిన ఆధారాల కారణంగా రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది.

ఈ వివాదంలోకి పవన్‌ను కూడా జగన్ లాగారు. ఇంత అవినీతికి పాల్పడిన చంద్రబాబును ప్రశ్నించేందుకు పవన్ గొంతు ఎందుకు లేవదంటూ డైరెక్టుగానే జగన్ నిలదీశారు. ఈ విషయమై పవన్ ఇంతరవకు స్పందించలేదు. అయితే పవన్‌కు గట్టి మద్దతుదారుడైన చేగొండి మాత్రం స్పందించారు. జగన్ ఆరోపణలపై పవన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తెలుగుదేశంపార్టీతో కలిసి వెళ్ళాలని అనుకుంటున్న పవన్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

నీతివంతమైన పాలన అందిస్తానని చెబుతున్న పవన్, టీడీపీ అధినేతపై జగన్ చేసిన ఆరోపణలపై స్పందించకపోతే రాంగ్ సిగ్నల్ వెళుతుందన్నారు. చంద్రబాబుపై ఆరోపణలు నిరూపితమైతే టీడీపీతో పవన్ ఎలా పొత్తు పెట్టుకుంటారని జోగయ్య ప్రశ్నించారు. జగన్ చేసిన ఆరోపణలపై నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉందని జోగయ్య స్పష్టంగా చెప్పారు.

కాబట్టి తాజా అవినీతి ఆరోపణలపై పవన్ స్పందించాలని జోగయ్య డిమాండ్ చేశారు. జోగయ్య తాజా డిమాండ్‌తో పవన్ ఇరుకుపడినట్లే అవుతుంది. చంద్రబాబు మీద వచ్చిన అవినీతి ఆరోపణలకు స్పందించకూడదనే పవన్ ఏమీ మాట్లాడటంలేదు. స్కిల్ స్కామ్ పై పవన్ స్పందించాలని జగన్ అన్న తర్వాత కూడా పవన్ నోరు విప్పలేదు. సరిగ్గా ఇదే సమయంలో పవన్ స్పందించాలని జోగయ్య డిమాండ్ చేయటంతో పాటు ఓపెన్ లెటర్ రాయటం పవన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేసేదే అనటంలో సందేహంలేదు. జగన్ అన్నారని కాదుకానీ జోగయ్య సూచనపైన అయినా పవన్ స్పందింస్తారా?

First Published:  22 March 2023 5:57 AM GMT
Next Story