Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్సీల విషయంలో కాపులకు వైసీపీ అన్యాయం చేసిందా..?

జనాభా పరంగా మూడు సీట్లు రావాల్సిందేనంటూ పట్టుబట్టారు. రాయలసీమకు చెందిన బలిజ కులస్తుల్లో ఒక్కరికి కూడా టీటీడీ బోర్డులో సభ్యులుగా స్థానం కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీల విషయంలో కాపులకు వైసీపీ అన్యాయం చేసిందా..?
X

ఏపీలో 18ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ 18 స్థానాలు అధికార వైసీపీకి ఖాయంగా దక్కేవే. అందులో ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక కోటాలో 9, గవర్నర్ కోటాలో 2 సీట్లు భర్తీ అవుతాయి. మొత్తం 18 స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఖాయంగా గెలిచే ఆ అభ్యర్థుల విషయంలో వైసీపీ సామాజిక న్యాయం పాటించిందంటూ ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే సామాజిక న్యాయంలో కాపులకు అన్యాయం జరిగిందని విమర్శిస్తున్నారు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య.

ఆమధ్య కాపు రిజర్వేషన్ల విషయంలో సీఎం జగన్ కు ఘాటు లేఖ రాసి ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారారు హరిరామజోగయ్య. ఆ తర్వాత సొంత సామాజిక వర్గానికి చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ని లేఖలతో విమర్శించారు. పవన్ కల్యాణ్ పై మాట తూలితే చూస్తూ ఊరుకోబోమన్నారు. మళ్లీ ఇప్పుడు ఆయన లేఖాస్త్రాలు బయటకు తీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాపు వర్గానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. జనాభాపరంగా, తమకు మూడు స్థానాలు రావాల్సి ఉంటే కేవలం ఒకే స్థానంతో సరిపెట్టారన్నారు జోగయ్య.

ఎమ్మెల్యే కోటాలో ఏడు ఎమ్మెల్సీ సీట్లు భర్తీ కావాల్సి ఉందని, ఆయా నియోజకవర్గాల్లో 15లక్షలమంది కాపులు ఉన్నారని గుర్తు చేశారు హరిరామ జోగయ్య. అయినా కూడా తమకు ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీటు ఇచ్చారన్నారు. జనాభా పరంగా మూడు సీట్లు రావాల్సిందేనంటూ పట్టుబట్టారు. రాయలసీమకు చెందిన బలిజ కులస్తుల్లో ఒక్కరికి కూడా టీటీడీ బోర్డులో సభ్యులుగా స్థానం కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గెలుచుకోబోయే 18 సీట్లలో బీసీలకు 11, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1, ఓసీలకు 4 స్థానాలు కేటాయించారు సీఎం జగన్‌. సామాజిక న్యాయం పాటించారంటూ ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నా, కాపులనుంచి మాత్రం వ్యతిరేకత రావడం, హరిరామజోగయ్య లేఖతో కలకలం రేగడం విశేషం.

First Published:  21 Feb 2023 1:06 AM GMT
Next Story