Telugu Global
Andhra Pradesh

అది ఫేక్, ఇది ఒరిజినల్.. జోగయ్య మరో లేఖాస్త్రం

ఆల్రడీ జోగయ్య రాసిన ఒరిజినల్ లేఖ కాపు సామాజిక వర్గంలో సంచలనంగా మారింది, ఆ తర్వాత ఫేక్ లేఖ ఆ వ్యవహారాన్ని మరింత పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది. దీంతో ఆయన మరో లేఖ రాయాల్సి వచ్చింది.

అది ఫేక్, ఇది ఒరిజినల్.. జోగయ్య మరో లేఖాస్త్రం
X

హరిరామ జోగయ్య ఇటీవల లేఖాస్త్రాలతో నిత్యం వార్తల్లోకెక్కుతున్నారు. ఓసారి రాష్ట్ర ప్రజానీకానికి, మరోసారి కాపు సామాజిక వర్గానికి, ఇంకోసారి ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ కు ఆయన బహిరంగ లేఖలు రాస్తుంటారు. ఇటీవల టీడీపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థి వ్యవహారంపై ఆయన రాసిన లేఖ సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్ ని ఇరుకున పెట్టింది. ఈ క్రమంలో ఆయన నుంచి మరో లేఖ బయటకొచ్చిందంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. కాపుల ఆత్మ గౌరవాన్ని పవన్ కల్యాణ్, చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారనేది ఆ లేఖ సారాంశం. పవన్ వైఖరి చూస్తుంటే జనసేనను టీడీపీలో విలీనం చేసేలా ఉందనే ఘాటు వ్యాఖ్యలు కూడా ఆ లేఖలో ఉన్నాయి. అయితే అదంతా ఫేక్ అని అంటున్నారు జోగయ్య. తాజాగా ఆయన మరో లేఖ రాశారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫేక్ లెటర్ ఇదే..



టార్గెట్ వైసీపీ..

ఆల్రడీ జోగయ్య రాసిన ఒరిజినల్ లేఖ కాపు సామాజిక వర్గంలో సంచలనంగా మారింది, ఆ తర్వాత ఫేక్ లేఖ ఆ వ్యవహారాన్ని మరింత పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది. దీంతో ఆయన మరో లేఖ రాయాల్సి వచ్చింది. అది ఫేక్, ఇది ఒరిజినల్ అంటూ ఆయన తాజా లేఖలో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఒరిజినల్ గా చెబుతున్న తాజా లేఖలో ఆయన వైసీపీని టార్గెట్ చేశారు. టీడీపీ-జనసేన మైత్రిని దెబ్బతీసే విధంగా వైసీపీ సానుభూతి పరులు తన పేరుతో ఫేక్ లెటర్ విడదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు జోగయ్య. ఈ తప్పుడు ప్రచారాన్ని జనసైనికులు గమనించాలని కోరారు. చీప్ ట్రిక్స్ కి పాల్పడుతున్న వైసీపీ వారి ట్రాప్ లో పడకుండా తప్పుడు వార్తలను నమ్మకుండా పవన్ కల్యాణ్ సీఎం పీఠం అధిష్టించేవరకు అంతా ఆయన వెంట ఉండాలని తాజా లేఖలో పేర్కొన్నారు జోగయ్య.

తాజాగా జోగయ్య రాసిన ఒరిజినల్ లెటర్ ఇది..



గ్యాప్ నిజమేనా..?

టీడీపీతో జనసేన కలవడం పెద్ద వింతేమీ కాదు కానీ.. సీట్ల విషయంలో మరీ జనసేనను తీసిపారేస్తారనే విషయం ఇప్పుడిప్పుడే ఆ పార్టీ నేతలకు అర్థమవుతోంది. పవన్ కూడా ఇచ్చినన్ని సీట్లతో సరిపెట్టుకోవాలని చూస్తున్నారు. బదులుగా తాను అసెంబ్లీకి వెళ్తే చాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆయన జనసేన విషయంలో రాజీ పడ్డారు. సీఎం సీటు విషయంలో సైలెంట్ అయ్యారు. దీన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమధ్య నారా లోకేష్ ఇంటర్వ్యూలో కాబోయే సీఎం చంద్రబాబేనని కుండబద్దలు కొట్టడంతో వారు మరింత హర్ట్ అయ్యారు. ఈ లోగా హరిరామ జోగయ్య లేఖలు జనసైనికుల్లో మరింత గందరగోళానికి దారితీస్తున్నాయి.

First Published:  25 Dec 2023 12:02 PM GMT
Next Story