Telugu Global
Andhra Pradesh

ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న గుజరాత్ నిర్ణయం..

2005 తర్వాత ఉద్యోగాల్లో చేరినవారు ఉద్యమం నుంచి విడిపోయారు. మరో ఉద్యమం మొదలైంది. శనివారం రాష్ట్రంలోని ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టారు. ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.

ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న గుజరాత్ నిర్ణయం..
X

సీపీఎస్ రద్దు కోసం ఇటీవల ఏపీలో ఉద్యోగులు ఉద్యమబాట పట్టిన విషయం తెలిసిందే. జీపీఎస్ అంటూ ప్రభుత్వం కొత్త విధానం తెరపైకి తెచ్చినా ఉద్యోగులు వినడంలేదు. దీంతో ప్రభుత్వమే ఓ మెట్టు దిగి 2004కి ముందు ఉద్యోగాల్లో చేరినవారందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తింపజేస్తామంటూ లీకులిచ్చింది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఖుషీగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యమం చేసేవారు, ఉద్యమ సంఘాల నేతలంతా దాదాపుగా 2004కి ముందే చేరారు. సో వారంతా హ్యాపీ.. ఆ తర్వాత చేరినవారు సీపీఎస్ విషయంలో పట్టుబట్టే అవకాశం లేదనేది ప్రభుత్వం అంచనా. ఈ ఆఫర్ తో ఉద్యోగులు శాంతించినట్టే కనిపిస్తున్నారు.

కానీ, ఇటీవల గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. గుజరాత్ లో కూడా సీపీఎస్ రద్దు కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం 2005ని డెడ్ లైన్ గా ప్రకటించింది. 2005కి ముందు ఉద్యోగాల్లో చేరినవారికి పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేస్తామని చెప్పింది. అయితే అక్కడ ఉద్యోగులు ఈ ఆఫర్ ఒప్పుకోలేదు. 2005 తర్వాత చేరినవారు ఉద్యమం నుంచి విడిపోయారు. మరో ఉద్యమం మొదలైంది. శనివారం రాష్ట్రంలోని ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టారు. ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో గుజరాత్ నిర్ణయం ఆశించిన ఫలితాలివ్వలేదని తేలిపోయింది.

ఏపీలో ఎలా..?

ప్రస్తుతం ఏపీలో కూడా ఉద్యోగులకు ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. 2004ని సీపీఎస్ రద్దుకోసం డెడ్ లైన్ గా పెట్టింది. ఇక్కడ మాత్రం ఉద్యోగుల్లో చీలిక రాలేదు. 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరినవారు మా సంగతేంటని ప్రశ్నించలేదు. కొంతమందికయినా ఫలితం దక్కింది కదా అని లైట్ తీసుకున్నారు. కానీ గుజరాత్ ప్రభావం ఏపీ ఉద్యమంపై కూడా కనపడేలా ఉంది. అక్కడ ప్రభుత్వం కచ్చితంగా తలొగ్గుతుందని, ఇక్కడ తామెందుకు వెనక్కి తగ్గాలని ఆలోచిస్తున్నారు ఉద్యోగులు. ఏపీలో ఉద్యోగులపై కేసులు పెట్టి వేధిస్తున్నారనే అపవాదు కూడా ఉంది. దీంతో ఉద్యోగులు కాస్త భయపడ్డారు. ఇప్పుడు గుజరాత్ ఉద్యోగులు చూపించిన దారిలో ఏపీ ఉద్యోగులు కూడా కండీషన్లు లేకుండా సీపీఎస్ రద్దుకోసం పోరాటం చేస్తారా, లేక ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ స్వీకరిస్తారా అనేది తేలాల్సి ఉంది.

First Published:  18 Sep 2022 2:37 AM GMT
Next Story