Telugu Global
Andhra Pradesh

వైసీపీలో గ్రూపుల గోల.. నంద్యాలలోనూ మొదలైంది..

నంద్యాలలో కేబుల్ టీవీ ప్రసారాల విషయంలో రాజగోపాల్ రెడ్డిని శిల్పా వర్గం ఇబ్బంది పెడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉచితంగా కేబుల్ కనెక్షన్లు ఇవ్వాలనుకుంటే.. శిల్పా వర్గం అడ్డుకుంటోందని అంటున్నారు రాజగోపాల్ రెడ్డి వర్గీయులు.

వైసీపీలో గ్రూపుల గోల.. నంద్యాలలోనూ మొదలైంది..
X

ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ.. సీఎం జగన్ కి ఎక్కువ పని పెట్టేలా ఉన్నారు వైసీపీ నాయకులు. గ్రూపు రాజకీయాలతో పంచాయితీలు పెట్టుకుంటున్నారు. తాజాగా నంద్యాలలో కూడా గొడవ మొదలైంది. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి, వైసీపీ కేంద్ర కమిటీ సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గతంలో ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు జగన్ వద్దకు కూడా వెళ్లినట్టు సమాచారం. మరి సీఎం దగ్గర ఎలాంటి పంచాయితీ జరుగుతుందో చూడాలి.

వైసీపీలో కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటినుంచే రెండు గ్రూపులు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరోసారి టికెట్ కోసం ఆరాటపడుతుంటే, గతంలో వారికి త్యాగం చేసినవారు, ఈసారి టికెట్ కోసం ఎదురు చూస్తున్నవారు అధిష్టానానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై, సీనియర్ నేత మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు సంచలనంగా మారాయి.

కేబుల్ టీవీ వ్యవహారంలో గొడవ..

నంద్యాలలో కేబుల్ టీవీ ప్రసారాల విషయంలో రాజగోపాల్ రెడ్డిని శిల్పా వర్గం ఇబ్బంది పెడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉచితంగా కేబుల్ కనెక్షన్లు ఇవ్వాలనుకుంటే.. శిల్పా వర్గం అడ్డుకుంటోందని అంటున్నారు రాజగోపాల్ రెడ్డి వర్గీయులు. దీనిపై కొన్నాళ్లుగా మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పుడది బయటపడింది. ఇద్దరు నాయకులు నేరుగా ఒకరినొకరు టార్గెట్ చేసుకునే వరకు వెళ్లింది. శిల్పా చక్రపాణి రెడ్డి కుటుంబం రోజుకో పార్టీ మారిందని ఆరోపిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. టీడీపీలో ఉంటూ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్‌ గా ఉన్న శిల్ప మోహన్ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరారని, ఆ తర్వాత వైఎస్ఆర్ చలవతో ఆయన ఎమ్మెల్యే, మంత్రి అయ్యారని.. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ కి వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారని గుర్తు చేశారు. ఆ తర్వాత మళ్లీ జగన్ పంచన చేరి టికెట్ సాధించారని. కానీ తాను మాత్రం మొదటి నుంచీ జగన్ నే నమ్ముకుని ఉన్నానని అన్నారు రాజగోపాల్ రెడ్డి. తనను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారంటూ వాపోయారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నంద్యాలలోనే కాదు, అటు తాడేపల్లిలో కూడా కలకలం రేపాయి. గ్రూపు రాజకీయాలతో నష్టపోతామంటూ పెద్దలు వారిస్తుంటే ఇన్నాళ్లు ఆగానని, తననే ఇబ్బంది పెడుతుండే సరికి తప్పడంలేదని అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. అధిష్టానం వీరిద్దరిని పిలిపించి చర్చించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

First Published:  12 Sep 2022 1:50 AM GMT
Next Story