Telugu Global
Andhra Pradesh

సీమలో 40 ఏళ్ల క్రితం నాటి ప‌చ్చ‌ని దృశ్యాలు

దాదాపు 40ఏళ్ల తర్వాత భారీ వర్షాలను చూస్తున్నామని గ్రామాల్లోని వృద్దులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం వరకు అనంతపురం జిల్లాలో కొండలన్నీ కేవలం రాళ్లతో కనిపించేవి. ఇప్పుడు జిల్లాలో కొండలన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి.

సీమలో 40 ఏళ్ల క్రితం నాటి ప‌చ్చ‌ని దృశ్యాలు
X

వరుసగా మూడేళ్ల పాటు సమృద్ధిగా కురుస్తున్న వర్షాలకు రాయలసీమలో జలకళ ఉట్టిపడుతోంది. అతి తక్కువ వర్షపాతంతో అల్లాడే అనంతపురం జిల్లాలోనూ భూగర్భ జలాలు పైకి వచ్చేశాయి. కొన్ని ప్రాంతాల్లో బావుల నుంచి నీరు బయటకు పొంగుతోంది.

ఎప్పుడో 30, 40ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితిని చూశామని రాయ‌ల‌సీమ జనం అంటున్నారు. అప్పట్లో వర్షాలకు కాలువలు పారడం, చెరువుల్లోని చేపలు కాలువల ద్వారా వరి పొలాల్లోకి రావడం చూశామని.. ఈఏడాది తిరిగి అలాంటి దృశ్యాలను చూస్తున్నామని చెబుతున్నారు. కొందరు రైతులు తమ వరి పొలాల్లోకి వచ్చిన చేపలు పట్టుకుంటున్నారు.


రాయలసీమలోని మిగిలిన జిల్లాలే కాకుండా అనంతపురం జిల్లాలోని ప్రతి చెరువులు నీటితో నిండిపోయాయి. మూడేళ్ల క్రితం వ‌ర‌కూ అనంతపురం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ఇప్పుడు కేవలం 20, 30 అడుగుల్లోనే నీరు అందుతున్నాయి.

గతంలో రైతులు తమ పొలాల్లో నీటి కోసం ఐదు, పది బోర్లు వేసిన ఉదంతాలు ఉన్నాయి. నీరు రాక‌ వ్యవసాయమే మానేశారు. అలా అప్పట్లో వదిలేసిన బోర్లలో నీళ్లు పైకి వచ్చేయడంతో తిరిగి పంటలేస్తున్నారు. అనంతపురం జిల్లాలో వేలాది బోర్లు రీచార్జ్ అయ్యాయి.


దాదాపు 40ఏళ్ల తర్వాత భారీ వర్షాలను చూస్తున్నామని గ్రామాల్లోని వృద్దులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం వరకు అనంతపురం జిల్లాలో కొండలన్నీ కేవలం రాళ్లతో కనిపించేవి. ఇప్పుడు జిల్లాలో కొండలన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి. మూడేళ్ల పాటు వర్షాలు పడటంతో కొండల్లో గడ్డే కాకుండా చెట్లు కూడా ఏపుగా పెరుగుతున్నాయి.

Next Story