Telugu Global
Andhra Pradesh

ఏపీలో ప్రతి విద్యార్థిపై ట్రాకింగ్..

విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ, వారు వినియోగస్తున్న తీరుపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్యాబ్ లు రిపేరు వస్తే వెంటనే వాటికి మరమ్మతులు చేయించి ఇవ్వాలన్నారు.

ఏపీలో ప్రతి విద్యార్థిపై ట్రాకింగ్..
X

ఏపీలో ప్రతి విద్యార్థిపై ట్రాకింగ్ ఉండాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు సీఎం జగన్. విద్యా శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లు, కాలేజీలకు వస్తున్న విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్‌ ఉండాలని స్పష్టం చేశారు. స్కూల్, కాలేజీలకు రాని విద్యార్థుల వివరాలు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేస్తున్నామని, ఎక్కువ రోజులు స్కూల్ కి రాకుండా ఉంటే వారి తల్లిదండ్రులతో నేరుగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది మాట్లాడాలని చెప్పారు. ఒక్క విద్యార్థి కూడా డ్రాపవుట్ గా మిగలకూడదని అన్నారు.

ఇంత చేస్తున్నాం కదా..

ఏ దశలో కూడా విద్యార్థులు.. స్కూల్, కాలేజీ మానేయకుండా చూడాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడిని అందిస్తున్నామని, ఆ తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన ఉన్నాయని, ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని.. ఇలాంటి సందర్భంలో ఎవరూ స్కూల్, కాలేజీ మానేయకుండా ఉండాలని, ఆ బాధ్యత విద్యాశాఖ అధికారులదేనన్నారు.

విద్యాకానుక సకాలంలో..

ఇటీవల విద్యాకానుక కిట్లు సకాలంలో పిల్లలకు అందడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. స్కూల్ తెరిచిన చాలా రోజులకు ఈ కిట్లు పంపిణీ చేస్తున్నారు. దీనిపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో విద్యాకానుక ఆలస్యం కాకూడదని ఆదేశించారు. సబ్జెక్టు టీచర్ల విధానంపై కూడా ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు. ఐఐటీ మద్రాస్‌ ఆధ్వర్యంలో సర్టిఫికెట్‌ కోర్సులు నేర్చుకునేందుకు ఉపాధ్యాయులకు అవకాశం కల్పిస్తామన్నారు.

విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు..

స్కూలు పిల్లలకు టోఫెల్‌ సర్టిఫికెట్‌ పరీక్షలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ, వారు వినియోగస్తున్న తీరుపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్యాబ్ లు రిపేరు వస్తే వెంటనే వాటికి మరమ్మతులు చేయించి ఇవ్వాలన్నారు. ఇక పరీక్షల విషయంపై కూడా జగన్ అధికారులతో సమీక్ష చేపట్టారు. పరీక్షల నిర్వహణ పగడ్బందీగా ఉండాలన్నారు. పేపర్ లీకేజీ సమస్య తలెత్తకుండా చూసుకోవాలని చెప్పారు. రెండో దశ నాడు - నేడు పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

First Published:  10 April 2023 11:43 AM GMT
Next Story