Telugu Global
Andhra Pradesh

ఏపీలోనే విద్యుత్‌ కోతలా?.. కారణాలేంటి?

గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టులో వాతావరణం పూర్తి ప్రతికూలంగా మారిందని, వేడి అమాంతం పెరిగిందని.. అయినా సరే విద్యుత్ శాఖ ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లడం వల్ల విద్యుత్ కోతలు కనీస స్థాయిలోనే ఉన్నాయని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

ఏపీలోనే విద్యుత్‌ కోతలా?.. కారణాలేంటి?
X

ఏపీలో విద్యుత్‌ కోతలపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అటు ప్రభుత్వం ఇందుకు కారణాలు వివరిస్తోంది. ఏపీలో కొద్ది రోజులుగా విద్యుత్‌ కోతలు వాస్తవమే. గ్రామాల్లో రాత్రి వేళ రెండు మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా ఆగిపోతోంది. వ్యవసాయానికి ఇబ్బందులు తప్పడం లేదు. పగటి పూట కేవలం రెండు గంటలు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అవుతోంది. పగలు కంటే రాత్రి వేళల్లో ఎక్కువ వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ఆటో స్టార్టర్లు కావడంతో రాత్రివేళ విద్యుత్ ఇచ్చినా రైతులకు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో లో ఓల్టేజ్‌ సమస్య వెంటాడుతోంది. వ్యవసాయానికి విద్యుత్ ఎప్పుడు ఇస్తారు అన్న దానిపై స్థానిక విద్యుత్ సిబ్బంది స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. పైనుంచే ఇబ్బంది ఉందంటున్నారు. రైతులు బోరుబావుల దగ్గర ఎదురుచూడడం కంటే ఆటో స్టార్టర్ వ్యవస్థను ఆన్‌ చేసి ఉంచుకోవాలని.. కరెంట్ వచ్చినప్పుడు నీరు అందుతుందని సలహా ఇస్తున్నారు. అయితే విద్యుత్ నిరంతరం సరఫరా కాకపోవడంతో కొన్ని చోట్ల పంటలు ఎండుతున్నాయి.

వర్షాకాలంలో ఈ పరిస్థితి రావడానికి ప్రధానంగా వాతావరణ పరిస్థితులే కారణం. ఆగస్టు నెల మొత్తం ఏపీలోని చాలా జిల్లాల్లో వాన జాడే లేదు. పగటి ఉష్ణోగ్రతలు వేసవి కాలం తరహాలో నమోదు అవుతున్నాయి. దాంతో గృహ విద్యుత్ వినియోగం అమాంతరం పెరిగింది. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టులో వాతావరణం పూర్తి ప్రతికూలంగా మారిందని, వేడి అమాంతం పెరిగిందని.. అయినా సరే విద్యుత్ శాఖ ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లడం వల్ల విద్యుత్ కోతలు కనీస స్థాయిలోనే ఉన్నాయని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

ప్రతికూల పరిస్థితుల కారణంగా పవన, జల విద్యుత్ ఉత్పత్తి భారీగా తగ్గిపోయిందని.. శ్రీశైలం విద్యుత్ కేంద్రం నుంచి ఆగస్టులో ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి కాలేదని వివరిస్తోంది. గతేడాది ఆగస్టులో జల విద్యుత్ ఉత్పత్తి 680 మిలియన్ యూనిట్లు కాగా.. ఈ ఏడాది ఆగస్టులో అది 208 మి.యూ పడిపోయిందని గణాంకాలను వెల్లడించింది. గాలుల తీవ్రత పూర్తిగా తగ్గిపోవడంతో పవన్‌ విద్యుత్ ఉత్పత్తి 2500 మెగావాట్ల నుంచి 150 మెగావాట్లకు పడిపోయిందని ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో వర్షాలు లేకపోవడం, ఎండలు విపరీతంగా ఉండడంతో గృహ విద్యుత్ వినియోగం పెరగడం, కాలువ కింద నీటి సరఫరా లేకపోవడంతో రైతులు కూడా ఎక్కువగా బోర్ల నుంచి నీటిని తోడేందుకు విద్యుత్‌ను వాడుతుండడంతో అసాధారణ పరిస్థితులు తలెత్తాయని ప్రభుత్వం వివరించింది. సాధారణంగా ఆగస్టు నెలలో వ్యవసాయ విద్యుత్ వినియోగం కనిష్ట స్థాయిలో ఉంటుందని.. ఈ సారి మాత్రం భారీగా పెరగడంతో గ్రిడ్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉందని చెబుతోంది.

ఈ పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉండడంతో బహిరంగ మార్కెట్‌లోనూ విద్యుత్‌ తగినంత అందుబాటులో లేదని అధికారులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో 2వేల మెగావాట్ల విద్యుత్ కోసం బిడ్ వేస్తే.. కేవలం అందులో 5 నుంచి 10 శాతం మాత్రమే అందుబాటులోకి వస్తోందని వివరించింది. విద్యుత్ ఎక్స్చేంజ్‌లో యూనిట్ విద్యుత్‌ను 10 రూపాయలకు మించి కొనడానికి లేదు. ఇప్పుడు లభిస్తున్న విద్యుత్‌ కూడా సీలింగ్‌ రూ.10 వద్దే అందుతోంది. దాంతో సెంట్రల్ గ్రిడ్ నుంచి ఓవర్‌ డ్రా కూడా సాధ్యం కావడం లేదని చెబుతున్నారు. జరిమానా పడ్డా పర్వాలేదు అన్న ఉద్దేశంతో కొన్ని సార్లు ఓవర్‌ డ్రా చేస్తున్నా గ్రిడ్ భద్రత రీత్యా ఆటోమెటిక్ లోడ్ రిలీఫ్ వ్యవస్థ యాక్టివేట్‌ అవడంతో మధ్యమధ్యలో విద్యుత్ అంతరాయం కలుగుతోందని అధికారులు వివరించారు. దక్షిణ భారతదేశం వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ఏపీ ప్రభుత్వం తన ప్రకటనలో వివరించింది.

First Published:  2 Sep 2023 7:18 AM GMT
Next Story