Telugu Global
Andhra Pradesh

వైజాగ్ బీచ్ రోడ్డులో సీఎం వైఎస్ జగన్ ఇల్లు! మార్చి మూడో వారంలో గృహ ప్రవేశం?

ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆదేశాలు రాకపోయినా.. రాష్ట్ర పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు అందడంతో చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

వైజాగ్ బీచ్ రోడ్డులో సీఎం వైఎస్ జగన్ ఇల్లు! మార్చి మూడో వారంలో గృహ ప్రవేశం?
X

ఏపీ రాజధానిగా ఇకపై విశాఖపట్నం ఉండబోతోందని గత వారంలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఒకవైపు సుప్రీంకోర్టులో మూడు రాజధానులపై విచారణ కొనసాగుతుండగానే.. వైసీపీ ప్రభుత్వం మాత్రం వైజాగ్‌ను స్టేట్ క్యాపిటల్‌గా చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. త్వరలోనే తాను విశాఖకు షిఫ్ట్ అవుతానని కూడా సీఎం చెప్పారు. రాజధాని తరలింపు పనులను ఇప్పుడు విశాఖ జిల్లా యంత్రాంగం యుద్ద ప్రాతిపదికన చేపట్టింది.

ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆదేశాలు రాకపోయినా.. రాష్ట్ర పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు అందడంతో చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని తరలింపునకు సంబంధించిన ఆదేశాలు ఏ క్షణమైనా రావొచ్చనే ఉద్దేశంతోనే అధికారులు సీఎం జగన్ ఇల్లు, ఇతర కార్యాలయాల కోసం అన్వేషణ ప్రారంభమైంది. బయటకు పొక్కుండా.. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సీఎం ఇంటికోసం వెదుకుతున్నట్లు తెలుస్తున్నది.

వైజాగ్ బీచ్ రోడ్‌లో సీఎం కోసం అనువైన ఇంటిని వెదికే పని ప్రారంభమైంది. మార్చి 22, 23 తేదీల్లో సీఎం కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. వీఎంఆర్‌డీఏ అధికారులు ఇటీవల ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్ పక్కన ఉన్న రోడ్డును విస్తరణ చేపట్టారు. ఈ రోడ్డులోనే సీఎం జగన్ నివాసం ఉండబోతోందనే చర్చ జరుగుతోంది.

మరోవైపు మంత్రుల కోసం కూడా అనుకూలమైన భవనాలను వెతుకుతున్నారు. సాధ్యమైనంతగా మంత్రుల ఇళ్లన్నీ దగ్గరగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక రాష్ట్ర స్థాయి అధికారుల కోసం ఇళ్లు వెదుకుతున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారుల కోసం కొత్తగా కట్టిన ఇళ్లను ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ అధికారుల కోసం ఏఎంసీ అంకోశా సమీపంలో డ్యూప్లెక్స్ ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తానికి అనధికారికంగా విశాఖలో కొత్త రాజధాని కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

First Published:  7 Feb 2023 4:55 AM GMT
Next Story