Telugu Global
Andhra Pradesh

మళ్లీ చర్చలకు పిలిచిన ప్రభుత్వం.. ఏపీ ఉద్యోగులు మెత్తబడతారా..?

ఏపీలో సీపీఎస్ వ్యవహారంపై ఇప్పటికే చాలా పీటముడులు పడిపోయాయి. వాటిని విప్పడం ఎవరి వల్లా కావడంలేదు. సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి.

మళ్లీ చర్చలకు పిలిచిన ప్రభుత్వం.. ఏపీ ఉద్యోగులు మెత్తబడతారా..?
X

ఏపీలో సీపీఎస్ వ్యవహారంపై ఇప్పటికే చాలా పీటముడులు పడిపోయాయి. వాటిని విప్పడం ఎవరి వల్లా కావడంలేదు. సీపీఎస్ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. ఆ ఒక్కటీ అడక్కండి, కావాలంటే జీపీఎస్ లో సవాలక్ష మార్పులు చేసుకోండి అంటూ ప్రభుత్వం ఆఫర్ ఇస్తోంది. ఇప్పటికే నాలుగు సార్లు చర్చలు విఫలం అయ్యాయి. తాజాగా మరోసారి ఉద్యోగుల్ని చర్చలకు ఆహ్వానించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. కానీ ఈ ఆహ్వానాన్ని మన్నించేందుకు ఉద్యోగులు సిద్ధంగా లేరు.

సెప్టెంబర్ 1న సీఎం ఇంటి ముట్టడి క్యాన్సిల్ అయింది. పోలీసుల బైండోవర్లు ఓవైపు, ముఖ్యమంత్రి ఆ రోజు విజయవాడలో ఉండరనే సమాచారతో ఆందోళనను సెప్టెంబర్ 11కి వాయిదా వేసుకున్నారు ఉద్యోగులు. ఈసారి తగ్గేది లేదంటున్నారు. సీపీఎస్ విషయంలో ప్రభుత్వం కూడా ఆందోళనలో ఉంది. సాక్షాత్తూ సీఎం జగన్ కూడా టీచర్చ్ డే రోజున ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిందేనన్నారు. ప్రతిపక్షాలు టీచర్లను రెచ్చగొడుతున్నాయంటూ మండిపడ్డారు. అంటే ఈ సమస్య పరిష్కారం కోసం ఎన్నికల హామీలు 100 శాతం నెరవేర్చామనే మాటకోసం వైసీపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఉద్యోగులు మెత్తబడటంలేదు. చివరిసారిగా చర్చలకు రండి అంటూ బొత్స పిలిచినా.. సీపీఎస్ రద్దు మినహా అంటూ కండిషన్ పెట్టే సరికి ఉద్యోగులు వెనకాడుతున్నారు.

తెగేదాకా లాగుతారా..?

సెప్టెంబర్ 11న విజయవాడలో ఉద్యోగులు మిలియన్ మార్చ్ చేశారంటే కచ్చితంగా గొడవలు జరిగే అవకాశాలున్నాయి. పీఆర్సీ ఆందోళనలకంటే ఈసారి ఉద్యోగులు గట్టిగా ఉన్నారు, అటు పోలీసులూ రెడీ అంటున్నారు. ప్రతిపక్షాలు కూడా అగ్గి రాజేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అవాంఛనీయ ఘటనలు జరిగితే అది కచ్చితంగా ప్రభుత్వానికి మచ్చగా మిగిలిపోతుంది. అందుకే పదే పదే చర్చలంటూ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. కానీ ఉద్యోగులు ఈ అవకాశాన్ని వదులుకోవాలనుకోవడంలేదు. పట్టుబట్టి తాము అనుకున్నది సాధించుకోవాలనుకుంటున్నారు.

First Published:  6 Sep 2022 11:15 AM GMT
Next Story