Telugu Global
Andhra Pradesh

జీవో.1 ప్రతిపక్షాలకు మాత్రమేనా..? మంత్రే ఉల్లంఘించారా..?

జాతీయ రహదారిని మంత్రి మద్దతుదారులు తమ కంట్రోల్లోకి తీసుకుని ట్రాఫిక్ ను నిలిపేసినట్లు ఎల్లోమీడియా ఆరోపిస్తోంది. మార్కాపురం-వెల్లంపల్లి గ్రామాల మధ్య మంత్రి కాన్వాయ్ ను పార్టీ నేతలు చాలాసార్లు నిలిపేశారట.

జీవో.1 ప్రతిపక్షాలకు మాత్రమేనా..? మంత్రే ఉల్లంఘించారా..?
X

ప్రభుత్వం జనవరి 1వ తేదీన జారీచేసిన ఆదేశాలు కేవలం ప్రతిపక్షాలకు మాత్రమేనా..? మంత్రులకు వర్తించవా..? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్డు షోలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులపైన ప్రతిపక్షాల్లో మిశ్రమస్పందనుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఏమో దీన్ని చీకటి జీవో అంటూ విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మూడురోజుల కుప్పం పర్యటనలో చంద్రబాబుకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించి అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు-పోలీసుల మధ్య ఎంత పెద్ద రచ్చయ్యిందో అందరూ చూసిందే. ఈ గొడవ ఒకవైపు నడుస్తుండగానే ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రోగ్రామ్ వివాదాస్పదమైంది. మంత్రి రాకసందర్భంగా మద్దతుదారులు పెద్దఎత్తున ర్యాలీ, రోడ్డుషో నిర్వహించినట్లు ఆరోపణలు మొదలయ్యాయి.

జాతీయ రహదారిని మంత్రి మద్దతుదారులు తమ కంట్రోల్లోకి తీసుకుని ట్రాఫిక్ ను నిలిపేసినట్లు ఎల్లోమీడియా ఆరోపిస్తోంది. మార్కాపురం-వెల్లంపల్లి గ్రామాల మధ్య మంత్రి కాన్వాయ్ ను పార్టీ నేతలు చాలాసార్లు నిలిపేశారట. టపాకాయలు కాల్చుతూ, డీజే మోతలతో మంత్రికి స్వాగతం పలికారట. జాతీయరహదారిపై మంత్రి పాదయాత్రగా వెళ్ళినప్పుడు ఆయనవెంట సుమారు 500 మంది నేతలు, కార్యకర్తలు ఉన్నట్లు చెప్పింది. వీళ్ళవల్ల ట్రాఫిక్ ఆగిపోయిందట. వెల్లంపల్లి ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అక్కడే ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారట.

ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మంత్రి రోడ్డుషో, ర్యాలీతో పాటు సభను నిర్వహించినట్లు ఎల్లోమీడియా ఆరోపిస్తోంది. ఇదే నిజమైతే మంత్రితో పాటు కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన వారిపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సిందే. ప్రభుత్వ నిబంధనలంటే అది ప్రతిపక్షాలకే కాదు మంత్రులు, అధికారపార్టీ నేతలకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం ఆచరణలో చూపించాలి. లేకపోతే జనాలకు ప్రభుత్వంపై నమ్మకం పోతుంది. ముందు మంత్రులు లేదా అధికారపార్టీ నేతల ఉల్లంఘనలపై యాక్షన్ తీసుకుంటేనే తర్వాత ప్రతిపక్ష నేతలపై యాక్షన్ తీసుకునే నైతిక హక్కు ప్రభుత్వానికి వస్తుందని ప్రభుత్వం గుర్తించాలి.

First Published:  7 Jan 2023 6:46 AM GMT
Next Story