Telugu Global
Andhra Pradesh

టూరిస్ట్ హబ్‌గా వైజాగ్.. త్వరలో మెగా జెయింట్ వీల్, టన్నెల్ అక్వేరియం

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో మూడు భారీ టూరిజం ప్రాజెక్టులకు అంకురార్పన పడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

టూరిస్ట్ హబ్‌గా వైజాగ్.. త్వరలో మెగా జెయింట్ వీల్, టన్నెల్ అక్వేరియం
X

ఏపీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌గా మారబోతున్న వైజాగ్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సహజమైన, ప్రకృతి సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న వైజాగ్ సిటీని.. టూరిస్ట్ హబ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు మార్చి మొదటి వారంలో విశాఖపట్నం వేదికగా జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను ఉపయోగించుకోవాలని అనుకుంటున్నది. 2021 మే 4న జరిగిన కేబినెట్ సమావేశంలో వైజాగ్‌కు పలు టూరిజం ప్రాజెక్టులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇంత వరకు అవి కార్యరూపం దాల్చలేదు.

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో మూడు భారీ టూరిజం ప్రాజెక్టులకు అంకురార్పన పడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారని.. అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐలు కొంత మంది విదేశీ సంస్థలతో కలిసి మూడు ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తున్నది. నగరంలో ఒక స్కై టవర్‌తో పాటు టన్నెల్ ఎక్వేరియం, మెగా జెయింట్ వీల్‌ను ఏర్పాటు చేయడానికి గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో ఒప్పందాలు జరుగబోతున్నాయి.

టర్కీకి చెందిన పొలిన్ అక్వేరియమ్స్ అనే సంస్థతో కలిసి రూ.250 కోట్ల వ్యయంతో టన్నెల్ అక్వేరియంను నిర్మించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఈ అక్వేరియం పర్యటకులకు అత్యున్నత అనుభూతిని ఇస్తుందని చెబుతున్నారు. ఇక స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటామిన్ వరల్డ్‌వైడ్ అనే సంస్థతో కలిసి స్కై టవర్‌ను రూ.100 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. ఇక పాక్స్ రష్యా అనే కంపెనీ రూ.243 కోట్ల వ్యయంతో మెగా జెయింట్ వీల్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తున్నది. లండన్‌లోని జెయింట్ వీల్ తరహాలోనే.. 'ఐ ఆన్ వైజాగ్' పేరుతో ఈ మెగా జెయింట్ వీల్ నిర్మాణం జరుగనున్నది.

వైజాగ్‌లో నిర్మించబోయే మెగా జెయింట్ వీల్ ఇండియాలోనే అది పెద్దదిగా రికార్డు సృష్టించబోతోంది. అలాగే ప్రపంచంలోని భారీ జెయింట్ వీల్స్ కలిగి ఉన్న 10 నగరాల సరసన వైజాగ్ చేరబోతోంది. ఈ మూడు ప్రతిష్టాత్మక టూరిజం ప్రాజెక్టులు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగమారిపేట బీచ్ వద్ద రానున్నట్లు తెలుస్తున్నది. 'ఐ ఆన్ వైజాగ్' ప్రాజెక్టు పీపీపీ పద్దతిలో జాయింట్ వెంచర్‌గా నిర్మించనున్నారు. ఒకేసారి 440 మంది ఈ జెయింట్ వీల్ ఎక్కవచ్చు. అలాగే 176 మంది రైడింగ్ టైమ్‌లో డైనింగ్ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చని తెలుస్తున్నది.

వైజాగ్ అక్వేరియంగా పిలిచే టన్నెల్ అక్వేరియం కోసం ఇప్పటికే డ్రాఫ్ట్ సిద్దమయినట్లు సమాచారం. తాబేలు ఆకారంలో ఉండే బిల్డింగ్‌లో ఈ అక్వేరియం ఉంటుంది. సముద్ర తాబేళ్లను రక్షించాలనే అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఈ షేప్‌లో అక్వేరియం నిర్మించనున్నారు. 27వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే ఈ టన్నెల్ అక్వేరియంలో దాదాపు 230 మీటర్ల మేర నడవాల్సి ఉంటుంది. ఇక్కడే ఇండియాలో తొలి అండర్ వాటర్ రెస్టారెంట్ కూడా నిర్మించనున్నారు.

ఇక వైజాగ్‌లో రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించనున్న స్కై టవర్ ప్రాజెక్ట్ నగరానికి మరో ఆకర్షణగా నిలవబోతోంది. ఇది ఆసియాలోనే టాలెస్ట్ టవర్‌గా రికార్డు సృష్టించబోతోంది. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయితే వైజాగ్ టూరిజం హబ్ గా నిలవడం ఖాయమని అధికారులు అంటున్నారు. దేశ విదేశీ పర్యటకులను ఆకర్షించడానికి ఇవి ఉపయోగపడతాయని ధీమా వ్యక్తం చేస్తుున్నారు.

First Published:  21 Feb 2023 3:40 AM GMT
Next Story