Telugu Global
Andhra Pradesh

రుషికొండకు జియో మ్యాటింగ్.. ఎందుకిలా..?

కొత్తగా రుషికొండపై జియో మ్యాటింగ్ అనేది ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆకుపచ్చని పరదాలతో కొండపై తొలచిన ప్రాంతాన్ని కప్పివేస్తున్నారు అధికారులు. ఇదంతా ఎందుకు చేస్తున్నారనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం.

రుషికొండకు జియో మ్యాటింగ్.. ఎందుకిలా..?
X

విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకుంటున్న ఏపీ ప్రభుత్వం కొండపై భవనాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే రుషికొండపై భవనానలు నిర్మించే క్రమంలో కొండ ఆకృతి పూర్తిగా మారిపోయిందని, అక్కడి పచ్చదనం మాయమైందని, ఇది పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి. మరోవైపు రుషికొండపై నిర్మాణాలు మాత్రం ఆగలేదు. అయితే ఇప్పుడు కొత్తగా రుషికొండపై జియో మ్యాటింగ్ అనేది ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆకుపచ్చని పరదాలతో కొండపై తొలచిన ప్రాంతాన్ని కప్పివేస్తున్నారు అధికారులు. ఇదంతా ఎందుకు చేస్తున్నారనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం.

గ్లోబల్ సమ్మిట్ కోసమేనా..?

త్వరలో విశాఖ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్లోబల్ సమ్మిట్ జరగాల్సి ఉంది. ఆ సమయంలో వచ్చే అతిథులకు రుషికొండ పచ్చగా కనిపించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారని ప్రతిపక్షాలు, టీడీపీ అనుకూల మీడియా ఆరోపిస్తున్నాయి. బోడిగుండుగా మార్చేసిన రుషికొండను కవర్ చేసుకోడానికి ప్రభుత్వం కష్టాలు పడుతోందంటూ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అయితే జియో మ్యాటింగ్ నిజమేనంటున్న అధికార వర్గాలు, పచ్చదనం పెంచడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టామని చెబుతున్నారు. జర్మన్‌ టెక్నాలజీతో జియో మ్యాటింగ్‌ చేస్తున్నామన్నారు. అత్యంత ఖరీదైన ఈ మ్యాట్‌ ను కొండపై ఓ చోట ప్రయోగాత్మకంగా పరిచామని, అక్కడ మొక్కలు బాగా పెరిగాయని, పచ్చదనం పెరగడం కోసం ఇది తోడ్పడుతుందని నిర్థారణ అయిందని అధికార యంత్రాంగం చెబుతోంది. కొద్ది రోజుల్లోనే మిగతా భాగాల్లోనూ పరుస్తామని చెబుతున్నారు. దీనివల్ల కొండను తొలిచిన భాగాల నుంచి మట్టి, రాళ్లు కింద పడకుండా ఉంటాయని, అదే సమయంలో మొక్కలు పెరిగి రాళ్లు, మట్టి ఊడిపడే పరిస్థితి ఎప్పటికీ రాదని అంటున్నారు. గ్లోబల్ సమ్మిట్ ని దృష్టిలో పెట్టుకొని ఈ పని చేయడం లేదని, కొండ పరిరక్షణలో భాగంగానే చేస్తున్నామని వివరణ స్తున్నారు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కూడా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ఆమధ్య ఇలాంటి ప్రయత్నమే చేశారు అధికారులు. ఇండోర్ లో రోడ్డు పక్కన ఎండిపోయిన గడ్డిపై ఆకుపచ్చ పెయింట్ ని స్ప్రే చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ నిర్వాకం బయటపడింది. ఇప్పుడు ఏపీలో కూడా అలా మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నమే జరుగుతోందనేది ప్రతిపక్షాల వాదన. ప్రభుత్వం మాత్రం దీర్ఘకాలిక ప్రయోజనాలకోసమే ఈ పని చేపట్టామంటోంది. ఇందులో ఏది నిజమో, ఎంత నిజమో తెలియదు కానీ.. జియో మ్యాటింగ్ మాత్రం వాస్తవమేనని తేలిపోయింది.

First Published:  4 Feb 2023 11:00 PM GMT
Next Story