Telugu Global
Andhra Pradesh

అసలు కారణం ఇదే.. గీతాంజలి భర్త కీలక వ్యాఖ్యలు

భర్త మాటల ప్రకారం గీతాంజలి తీవ్ర మానసిక వేదన అనుభవించినట్టు తెలుస్తోంది. అర్థరాత్రి కూడా ఫోన్ చూసుకుని ఆమె బాధపడేదని చెప్పారు భర్త బాలచందర్.

అసలు కారణం ఇదే.. గీతాంజలి భర్త కీలక వ్యాఖ్యలు
X

గీతాంజలి ఆత్మహత్య ఏపీలో రాజకీయ కలకలంరేపింది. టీడీపీ అల్లరిమూకల దాష్టీకానికి ఆమె బలైందని సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాదు కాదు, మా తప్పేం లేదని టీడీపీ కవర్ చేసుకుంటోంది. ఈ దశలో గీతాంజలి భర్త బాలచందర్ పలు కీలక విషయాలు వెల్లడించారు. సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే తన భార్య తీవ్ర మానసిక వేదనకు గురైందని, చివరకు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

అర్థరాత్రి కూడా ఫోన్ చూసుకుని..

భర్త మాటల ప్రకారం గీతాంజలి తీవ్ర మానసిక వేదన అనుభవించినట్టు తెలుస్తోంది. అర్థరాత్రి కూడా ఫోన్ చూసుకుని ఆమె బాధపడేదని చెప్పారు భర్త బాలచందర్. తాను పనికి వెళ్లిన తర్వాత, పిల్లలను స్కూల్ కి పంపించి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. తాము ఎప్పుడూ సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టులు పెట్టలేదని, ఆ అలవాటు కూడా తమకి లేదని, కానీ తమపై మాత్రం కామెంట్లు పెట్టి వేధించారని అన్నారు. ఆ కామెంట్లు చూసి తన భార్య తీవ్ర ఆవేదన చెందిందని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడిందని వెల్లడించారు.

ఇలా కూడా ఉంటారా..?

సీఎం జగన్ పథకాలతో లబ్ధిపొందినవారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం సహజం. కానీ గీతాంజలి తనకు తాను ఏ పోస్టింగ్ పెట్టలేదు. ఇంటి పట్టా తీసుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడా జగన్ ని కానీ, వైసీపీని కానీ విపరీతంగా పొగడలేదు, పోనీ ప్రతిపక్షాల ప్రస్తావన కూడా లేదు. అయినా కూడా టీడీపీ ఆమెను టార్గెట్ చేసింది. టీడీపీ అనుబంధ అకౌంట్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్ జరగడంతో ఆమె మనోవేదనకు గురైంది, చివరకు ఆత్మహత్య చేసుకుంది.

వైసీపీ నేతలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా మంత్రులు, మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ సహా నేతలంతా ట్రోలింగ్ ని ఖండించారు. నిందితులకు కఠిన శిక్షలు పడాలని డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన నుంచి మాత్రం మౌనమే సమాధానమైంది. మహిళా దినోత్సవం రోజున.. ఆడవారందరికీ అండగా ఉంటామని ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్ కూడా గీతాంజలి మృతిపై కనీసం సానుభూతి తెలపలేదు. నారీశక్తి, నవశకం అంటూ కబుర్లు చెప్పే చంద్రబాబు కూడా తేలుకుట్టిన దొంగలా సైలెంట్ అయ్యారు.

First Published:  12 March 2024 1:41 PM GMT
Next Story