Telugu Global
Andhra Pradesh

చెత్తపన్ను చేటు తెస్తుందా..? సచివాలయ సిబ్బంది తిరుగుబాటు

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నా కూడా ఎవ్వరూ చెత్త పన్ను చెల్లించడానికి సిద్ధపడటంలేదు. దీంతో సచివాలయ సిబ్బంది మధ్యలో బలవుతున్నారు.

చెత్తపన్ను చేటు తెస్తుందా..? సచివాలయ సిబ్బంది తిరుగుబాటు
X

ఎవరయ్యా ఇక్కడ సెక్రటరీ.. ఇంత చిన్న ఇంటికి చెత్తపన్ను ఏంటి..? వాళ్లు పన్ను కట్టరు, వదిలెయ్ - గడప గడప కార్యక్రమంలో మెహర్బానీ కోసం ఓ వైసీపీ ఎమ్మెల్యే చెప్పిన మాట ఇది.

చెత్తపన్ను వసూలు చేసే బాధ్యత మీది కాదా..? చేయలేకపోతే మీ జీతంలో కట్ చేస్తాం - నగరపాలక సంస్థ కమిషనర్లు ఇస్తున్న ఆదేశాలివి.

ఏపీలో చెత్తపన్నుపై తీవ్ర వ్యతిరేకత ఉందనేది వాస్తవం. అయితే ప్రభుత్వం మాత్రం యూజర్ చార్జీల విషయంలో కఠినంగానే ఉంది. ప్రతిపక్షాలనుంచి విమర్శలు వస్తున్నా కూడా, ఆదాయం కోసం ప్రజలకు చెత్త నిర్వహణలో బాధ్యత నేర్పించడం కోసం పన్ను వసూలు చేస్తున్నారు. తడి, పొడి చెత్త విడివిడిగా సేకరించేందుకు చెత్తబుట్టలు పంపిణీ చేసి మరీ పన్ను వసూలు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ దాదాపు చాలా పట్టణాల్లో ఈ యూజర్ చార్జీలను ప్రజలు చెల్లించడంలేదు. దీంతో టార్గెట్లు సాధించలేక వార్డు సెక్రటరీలు లబోదిబోమంటున్నారు.

విశాఖలో రోడ్డెక్కారు..

విశాఖ నగరంలో యూజర్ చార్జీలు వసూలు చేయడంలో వెనకపడిన 10 మంది వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులపై జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ సస్పెన్షన్‌ వేటు వేశారు. ప్రజలు పన్ను చెల్లించకపోతే తాము బాధ్యులమా అంటూ సచివాలయ కార్యదర్శులు కమిషనర్‌ ఆఫీస్ ముందు బైఠాయించారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి చర్చలకు ఒప్పించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

సగం మాత్రమే..

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చెత్తపన్ను యూజర్ చార్జీలు సగం మాత్రమే వసూలవుతున్నాయి. మిగతా చోట్ల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నా కూడా ఎవ్వరూ చెత్త పన్ను చెల్లించడానికి సిద్ధపడటంలేదు. దీంతో సచివాలయ సిబ్బంది మధ్యలో బలవుతున్నారు. ప్రభుత్వం కూడా చెత్తపన్ను యూజర్ చార్జీల విషయంలో ఏదో ఒక స్థిర నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

First Published:  22 Jun 2023 2:24 AM GMT
Next Story