Telugu Global
Andhra Pradesh

గంటా సీటు గల్లంతు.. ఆ రెండు సీట్లు బీజేపీ, జనసేన ఖాతాలోకి..

గంటా శ్రీనివాస్‌ రావు 2019 ఎన్నికల్లో గెలిచిన విశాఖ నార్త్‌ పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లే అవకాశం ఉంది. బీజేపీ నాయకత్వం విష్ణుకుమార్‌ రాజు కోసం ఆ సీటును అడుగుతున్నట్లు తెలుస్తోంది.

గంటా సీటు గల్లంతు.. ఆ రెండు సీట్లు బీజేపీ, జనసేన ఖాతాలోకి..
X

టీడీపీ పొత్తులతో ఆ పార్టీ మాజీ ఎమ్యెల్యే గంటా శ్రీనివాసరావుకు పోటీ చేసేందుకు సీటు కూడా దొరికే అవకాశం లేకుండా పోయింది. గంటా ఆశిస్తున్న రెండు సీట్లు కూడా పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనలకు వెళ్తుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారాయ‌న‌. నిజానికి గంటా శ్రీనివాస రావు తాను పోటీ చేసే స్థానాలను మారుస్తుంటారు. ఒకసారి ఓ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిస్తే రెండోసారి కొత్త నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకొని అక్క‌డ‌ నుంచి పోటీ చేస్తుంటారు.

గంటా శ్రీనివాస్‌ రావు 2019 ఎన్నికల్లో గెలిచిన విశాఖ నార్త్‌ పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లే అవకాశం ఉంది. బీజేపీ నాయకత్వం విష్ణుకుమార్‌ రాజు కోసం ఆ సీటును అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో గంటా శ్రీనివాస రావు భీమిలికి వెళ్లాలని అనుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అవంతి శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే భీమిలి సీటును తమకు కేటాయించాలని జనసేన ఇప్పటికే చంద్రబాబును కోరింది.

2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున భీమీలి నుంచి పోటీ చేసి అవంతి శ్రీనివాస్‌ విజయం సాధించారు. దీంతో తమకు ఈ నియోజకవర్గంలో బలం ఉందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నారు. భీమిలిలో కాపు, యాదవుల ఓట్లు జయాపజయాలను నిర్ణయిస్తున్నాయి. ఈ కారణంగా కూడా పవన్‌ కల్యాణ్‌ తమ పార్టీకి ఆ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ స్థితిలో గంటా శ్రీనివాస్‌ రావుకు పోటీచేసేందుకు సీటే కూడా దొరకకుండా పోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

First Published:  12 Feb 2024 7:03 AM GMT
Next Story