Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకు గంటా శ్రీనివాసరావు షాక్‌..?

చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీకి గంటా దూరంగా ఉంటూ వచ్చారు. గంటా అప్పట్లో వైసీపీలో చేరుతారని కూడా ప్రచారం జరిగింది. అయితే, గంటా ప్రయత్నాలు ఫలించలేదు.

చంద్రబాబుకు గంటా శ్రీనివాసరావు షాక్‌..?
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆ పార్టీ నేత గంటా శ్రీనివాసరావు షాక్‌ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గంటాను మంత్రి బొత్స సత్యనారాయణపై చీపురుపల్లిలో పోటీకి దించాలని చంద్రబాబు భావించారు. గంటాతో ఆ విషయంపై మాట్లాడారు కూడా. అయితే, చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి గంటా సుముఖంగా లేరు.

తనకు భీమిలి సీటు కావాలని అడుగుతున్నారు. భీమిలి వీలు కాకపోతే విశాఖపట్నంలోని ఏ నియోజకవర్గమైనా ప‌ర్వాలేదని ఆయన చెప్పుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో చంద్రబాబును కలిసి తన నిర్ణయాన్ని చెప్పాలని గంటా అనుకుంటున్నారు. విశాఖ పరిధిలో ఎక్కడైనా ప‌ర్వాలేద‌ని ఆయన చెప్పాలని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అందుకు అంగీకరించకపోతే తన మార్గం తాను చూసుకోవాలని కూడా అనుకుంటున్నారట‌.

నిజానికి, గంటా మీద చంద్రబాబుకు కోపం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీకి గంటా దూరంగా ఉంటూ వచ్చారు. గంటా అప్పట్లో వైసీపీలో చేరుతారని కూడా ప్రచారం జరిగింది. అయితే, గంటా ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఎన్నికలు సమీపించగానే టీడీపీలో క్రియాశీలకంగా మారారు. చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు.

దాంతో చంద్రబాబు ఆయనను కాదనలేకపోయారు. కానీ, చీపురుపల్లిలో పోటీకి దించి ఆయనను దెబ్బ కొట్టాలని చంద్రబాబు వ్యూహమని కూడా అంటున్నారు. ఈ స్థితిలో గంటా చీపురుపల్లి నుంచి పోటీ చేయడానికి ఇష్టపడడం లేదు. గంటా ప్రయత్నాలు ఫలిస్తాయో, లేదో వేచి చూడాలి.

First Published:  2 March 2024 11:12 AM GMT
Next Story