Telugu Global
Andhra Pradesh

తూచ్.. అది ఉత్తుత్తి రాజీనామా..!

మూడేళ్ల కిందట రాజీనామా చేస్తే, ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో ఆమోదించడమేంటనేది గంటా వాదన. రాజీనామా చేసింది వాస్తవం అయితే, దాన్ని ఆమోదిస్తే అంత ఉలుకెందుకనేది అధికార పక్షం వాదన.

తూచ్.. అది ఉత్తుత్తి రాజీనామా..!
X

గంటా శ్రీనివాసరావు రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన వేళ.. ఆయన మరో ట్విస్ట్ ఇచ్చారు. అప్పుడెప్పుడో రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించడమేంటని హైకోర్టు మెట్లెక్కారు గంటా. తన రాజీనామా ఆమోదం వ్యవహారంలో ప్రొసీజర్ ఫాలో కాలేదనేది ఆయ వాదన. అందుకే స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు ఈ తాజా మాజీ ఎమ్మెల్యే. ఈ పిటిషన్ ఈనెల 29న విచారణకు వస్తుంది.

మూడేళ్ల కిందట రాజీనామా..?

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కార్మికుల ఉద్యమానికి మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హీరో అనిపించుకోవాలనుకున్నారు గంటా. మూడేళ్ల కిందట(2021 ఫిబ్రవరి 6న) తన పదవికి స్పీకర్ ఫార్మేట్ లోనే రాజీనామా చేసి పంపించారు. తన రాజీనామా ఆమోదించాలని కూడా ప్రత్యేకంగా కోరారు. అయితే అప్పట్లో ఆ రాజీనామాను స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదు. రాజీనామా ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయి.. ఉప ఎన్నికల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారమే హైలైట్ అయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే, గంటా సానుభూతితో గెలిస్తే, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందంటూ ప్రతిపక్షం రెచ్చిపోయే అవకాశముంది. ఇవన్నీ ఆలోచించే స్పీకర్ సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ప్రతిపక్షాన్ని బలహీన పరిచేందుకు హడావిడిగా రాజీనామా ఆమోదించారు. దీంతో గంటా కోర్టు మెట్లెక్కారు.

ఎవరి ప్లాన్ వారిది..

మూడేళ్ల కిందట రాజీనామా చేస్తే, ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో ఆమోదించడమేంటనేది గంటా వాదన. రాజీనామా చేసింది వాస్తవం అయితే, దాన్ని ఆమోదిస్తే అంత ఉలుకెందుకనేది అధికార పక్షం వాదన. ఈ దశలో గంటా పిటిషన్ మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ పిటిషన్ ఈనెల 29న ఏపీ హైకోర్టులో విచారణకు వస్తుంది. ఇప్పటి వరకు రాజీనామా ఎందుకు ఆమోదించలేదని స్పీకర్ ను కోర్టు ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెబుతారో చూడాలి. నువ్వు చేసిన రాజీనామాని నువ్వే కాదంటే ఎలా అని గంటాని ధర్మాసనం ప్రశ్నిస్తే ఆయన సమాధానం ఏంటో తేలాలి.

First Published:  25 Jan 2024 4:23 PM GMT
Next Story