Telugu Global
Andhra Pradesh

సోషల్ మీడియాకు తలవంచాల్సిందేనా?

ఏపీలో అన్నీ దినపత్రికల సర్క్యులేషన్ కలిపి సుమారు 35 లక్షలు కూడా దాటదు. సోషల్ మీడియా ఖాతాలు కోట్లలో ఉంటున్నాయి. ఇందులో లక్షల మంది రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎక్కడే ఏ సంఘటన జరిగినా దాని చరిత్ర,పుట్టుపూర్వోత్తరాలు జాతకంతో సహా జనాల కళ్ళముందుంటున్నాయి.

సోషల్ మీడియాకు తలవంచాల్సిందేనా?
X

మొనగాడిని అనుకునే ఎవరైనా సరే ప్రస్తుతం సోషల్ మీడియా దెబ్బకు తలొంచాల్సిందే. నేతల్లేరు, మీడియా లేదు సోషల్ మీడియా దెబ్బకు అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు మీడియా అంటే నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించేదనే అభిప్రాయం జనాల్లో ఉండేది. అప్పట్లో కూడా నిష్పక్షపాతమనే ముసుగులో తాము చెప్పదలచుకున్నది మాత్రమే మీడియా జనాలకు అందించేది. అయితే అప్పట్లో జనాలకు ఇప్పుడున్నంత అవేర్‌నెస్‌ లేదు కాబట్టి మీడియా యాజమాన్యాల ఆటలు చెల్లుబాటు అయిపోయాయి.

కానీ ఇప్పుడు పరిస్థితి అలాలేదు. మీడియా చెప్పని విషయాలు, నిజాలు కూడా సోషల్ మీడియా ద్వారా జనాలకు అందుతున్నాయి. చంద్రబాబునాయుడు అనపర్తి గొడవ కావచ్చు, లేదా గన్నవరం ఘటనా కావచ్చు. లోకేష్ పాదయాత్ర కూడా కావచ్చు. అలాగే ఉద్యోగుల సీపీఎస్ రద్దు విషయంలో జగన్మోహన్ రెడ్డి మడమతిప్పటం లాంటివన్నీ లెక్కలతో సహా పాత హామీలను, ఉల్లంఘనలను అన్నింటినీ సోషల్ మీడియా జనాలకు చెప్పేస్తోంది.

టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టారని ఈనాడు దినపత్రికలో వచ్చింది. అయితే వార్తతో పాటు ప్రచురించిన ఫొటోలు రెండేళ్ళ క్రితం నాటివని బయటపెట్టింది సోషల్ మీడియానే. దాంతో యాజమాన్యం క్షమాపణ చెప్పుకోవాల్సొచ్చింది. అంటే తాము ఏమి చెబితే అదే వార్త, తాము చెప్పిందే నిజమని మీడియా యాజమాన్యాలు అనుకునే రోజులు పోయాయి. పైగా పార్టీలకు అనుబంధంగా సోషల్ మీడియా విభాగాలు ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ప్రత్యర్థుల‌ కదలికలను చాలా నిశితంగా గమనిస్తున్నారు. దాంతో ఎప్పటెప్పటి మాటలు, ఫొటోలు కూడా ఇప్పుడు జనాలకు తెలిసిపోతున్నాయి.

ఏపీలో అన్నీ దినపత్రికల సర్క్యులేషన్ కలిపి సుమారు 35 లక్షలు కూడా దాటదు. సోషల్ మీడియా ఖాతాలు కోట్లలో ఉంటున్నాయి. ఇందులో లక్షల మంది రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎక్కడే ఏ సంఘటన జరిగినా దాని చరిత్ర,పుట్టుపూర్వోత్తరాలు జాతకంతో సహా జనాల కళ్ళముందుంటున్నాయి. దాంతో ఏది నిజం ఏది అబద్ధమని జనాలు గ్రహించగలుగుతున్నారు. కాబట్టి మీడియా యాజమాన్యాలు జాగ్రత్తగా ఉండకపోతే జనాలకు మళ్ళీ మళ్ళీ క్షమాపణలు చెప్పుకోక తప్పదంతే.

First Published:  24 Feb 2023 4:01 AM GMT
Next Story