Telugu Global
Andhra Pradesh

ఏపీ సీఈవో స్థాయి నుంచి సెంట్రల్ జైలు ఖైదీగా.. చంద్రబాబు రాజకీయ భవిష్యత్ ఏంటి?

ఒకప్పుడు ఏపీకి సీఈవోగా ప్రకటించుకొని.. పాలనలో సంస్కరణలు తెచ్చానని. ఐటీకీ ఆద్యుడినని చెప్పుకున్న చంద్రబాబు.. ఇవ్వాళ రాజమండ్రి సెంట్రల్ జైలులోని ఒక గదికి మాత్రమే పరిమితం కావడం వెనుక ఆయన చేసుకున్న తప్పిదాలే కారణమని పలువురు అంటున్నారు.

ఏపీ సీఈవో స్థాయి నుంచి సెంట్రల్ జైలు ఖైదీగా.. చంద్రబాబు రాజకీయ భవిష్యత్ ఏంటి?
X

ఎన్నికలు ఉన్నా, లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వాడివేడిగా కొనసాగుతుంటాయి. దక్షణాదిలో రాజకీయపరంగా ఎప్పుడూ వార్తల్లో ఉండే రాష్ట్రం ఏపీనే. ఇప్పుడు ఆ రాష్ట్రం మరోసారి వార్తల్లో నానుతున్నది. ఏపీ ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న అవినీతి కేసులో అరెస్టు అయ్యారు. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో ఏపీలో ఒక హై ప్రొఫైల్ అరెస్టు జరిగింది. ఈ అరెస్టు కేవలం టీడీపీలోనే కాకుండా ఏపీ రాజకీయాల్లో కూడా అలజడి సృష్టించింది.

ఒకప్పుడు ఏపీకి సీఈవోగా ప్రకటించుకొని.. పాలనలో సంస్కరణలు తెచ్చానని, ఐటీకీ ఆద్యుడినని చెప్పుకున్న చంద్రబాబు.. ఇవ్వాళ రాజమండ్రి సెంట్రల్ జైలులోని ఒక గదికి మాత్రమే పరిమితం కావడం వెనుక ఆయన చేసుకున్న తప్పిదాలే కారణమని పలువురు అంటున్నారు. 1995లో మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం అయిన చంద్రబాబు.. 2004 వరకు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు ఆయన అనుభవానికి పట్టం కట్టి సీఎం పదవిని కట్టబెట్టారు. కానీ, ఈ అవకాశాలన్నింటినీ చంద్రబాబు దుర్వినియోగం చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఏపీ వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రానికి తనను తాను సీఈవోగా చంద్రబాబు చెప్పుకున్నారు. అప్పుడే దేశంలో అడుగుపెట్టిన ఐటీ రంగాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ప్రభుత్వ, పార్టీ పరంగా ఏ సమావేశాలు పెట్టినా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్‌తో తనను తాను టెక్ సావీగా చూపించుకునే వారు. ఐటీని ఉపయోగించుకొని పారదర్శక పాలన తీసుకొని వచ్చానని ఇప్పటికీ చెప్పుకుంటారు.

కాగా, ఐటీకి ఆద్యుడిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. అదే ఐటీకి సంబంధించిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో జైలులో కూర్చోవడం యాదృశ్చికమే. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి రూ.370 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం చేకూర్చారనేది చంద్రబాబుపై ఉన్న ప్రధాన అభియోగం.

ఏపీకి నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన తర్వాత అక్కడ అనేక రకాలైన కార్యక్రమాలు, పథకాలు లాంఛ్ చేశారు. అదే సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా అమరావతిపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు.. రోజువారీ పాలనను మాత్రం ఏ మాత్రం అనుభవం లేని తన కొడుకు నారా లోకేశ్ చేతిలో పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఒకనాడు కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబు.. 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో బలమైన నాయకుడిగా ఉండేవారు. ఈ క్రమంలో 1999లో బీజేపీతో పొత్తుపెట్టుకొని కేంద్రంలో ఎన్డీయేతో పాటు మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఐటీ, టెక్నాలజీని పదే పదే వల్లించే చంద్రబాబు.. రైతులు, పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేశారనే విమర్శ ఉన్నది. దీంతో 2004 ఎన్నిక‌ల్లో చంద్రబాబు ఓడిపోయి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.

కాగా, 2009లో వైఎస్ఆర్ పోయారు. జ‌గ‌న్ జైలుకు వెళ్లారు.. జైలుకు వెళ్లిన సానుభూతి ఉన్నా.. చంద్రబాబు అనుభవం దృష్ట్యా 2014లో ఏపీ ప్రజలు తెలుగదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. ఏపీ ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారం ఇచ్చినా.. చంద్రబాబు మాత్రం ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. మొదట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పి.. ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు.. ఆ తర్వాత 2018 ఎన్నికల ముందు మాత్రం స్పెషల్ స్టేటస్ నినాదాన్ని భుజానికి ఎత్తుకున్నారు.

స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్రంలోని బీజేపీ, ప్రధాని మోడీపై కూడా ఇష్టానుసారం వ్యాఖ్యానించి ఎన్డీయేకి దూరమయ్యారు. ఇది చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పుగా రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. చంద్రబాబు గోడమీది పిల్లి వాటం చూసిన బీజేపీ అతడిని పూర్తిగా దూరం పెట్టింది. ఇప్పుడు బీజేపీ స్నేహం కోసం ఎంత అర్రులు చాస్తున్నా.. చంద్రబాబును ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు అరెస్టు తర్వాత కేంద్రంలోని బీజేపీ ఏ మాత్రం స్పందించపోవడం గమనించదగిన విషయం.

చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజల్లో కూడా పెద్దగా స్పందన రాలేదు. పైగా తెలుగు రాష్ట్రాల్లో అతడి అరెస్టును స్వాగతించడం.. చంద్రబాబు ఇమేజ్ ఎంతలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు దేశంలోనే పవర్‌ఫుల్ సీఎంగా ఉన్న వ్యక్తి.. ఇవ్వాళ జైలులో ఉన్నా పెద్దగా ప్రజల నుంచి వ్యతిరేకత రావడం లేదు. ఎన్టీఆర్ ఫ్యామిలీలోని చాలా మంది కూడా చంద్రబాబు అరెస్టుపై నోరు మెదపడం లేదు. కేవలం వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ తప్ప.. చంద్రబాబుకు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి సానుభూతి లభించడం లేదు.

ఒకప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అవినీతిపరుడు అంటూ వేలెత్తి చూపిన చంద్రబాబు.. ఇప్పుడు అదే అవినీతి స్కామ్‌లో కూరుకొని పోయారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామలు చూస్తే చంద్రబాబు ఈ కేసు నుంచి బయటపడటం అంత సులభమైన విషయం కాదని అనిపిస్తున్నది. బాబు జైలుకే పరిమితం అయితే పార్టీని ఎవరు నడిపిస్తారనే విషయంపై కూడా స్పష్టత లేదు.

73 ఏళ్ల చంద్రబాబు ఇప్పటికీ తన రాజకీయ వారసుడిని రాజకీయాల కోసం పూర్తిగా సన్నద్దం చేయలేదు. దీంతో చంద్రబాబు లేని సమయంలో పార్టీని నడిపించేది ఎవరనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ కేసుల నుంచి బయటపడి.. తిరిగి పార్టీని ఎన్నికల లోపు సిద్ధం చేయడం అంత సులభమైన విషయం కాదని కూడా చర్చ జరుగుతోంది. ఈసారి ఓడిపోతే చంద్రబాబు రాజకీయ భవిష్యత్ మాత్రమే కాకుండా.. టీడీపీ భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

*

First Published:  14 Sep 2023 6:45 AM GMT
Next Story