Telugu Global
Andhra Pradesh

విదేశీ ఉద్యోగం ఎర‌.. రూ.15 ల‌క్ష‌ల‌కు టోక‌రా

వారి మాట‌లు న‌మ్మిన రేవంత్ త‌న తండ్రి సాయంతో ముందుగా రూ. 5 ల‌క్ష‌లు స‌మ‌కూర్చి వారికి అంద‌జేశాడు. 2021 మే నెల‌లో ఆ సొమ్మును వారికి అంద‌జేశాడు.

విదేశీ ఉద్యోగం ఎర‌.. రూ.15 ల‌క్ష‌ల‌కు టోక‌రా
X

ఒక‌రు ద‌క్షిణాఫ్రికాలో.. ఇంకొక‌రు సింగ‌పూర్‌లో ఉద్యోగం చేశామ‌ని చెప్పారు.. విదేశాల్లో ఎవ‌రికైనా ఉద్యోగం అవ‌స‌ర‌మైన వారికి త‌మ ప‌రిచ‌యాలతో ఉద్యోగం ఇప్పించ‌గ‌ల‌మ‌ని ఆశ చూపారు.. అందుకు ల‌క్ష‌లు ఖ‌ర్చ‌వుతాయ‌ని చెప్పి న‌మ్మించారు. విదేశీ ఉద్యోగం ఎర‌గా చూపి.. 15 ల‌క్ష‌ల రూపాయ‌లు నొక్కేశారు. ఆన‌క ఫోన్ చేస్తే.. స్పందన లేదు.. దీంతో మోస‌పోయామ‌ని గ్ర‌హించిన బాధితులు పోలీసులు ఆశ్ర‌యించారు. విజ‌య‌వాడ కొత్త‌పేట పోలీసుల‌కు ఈ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు చేశారు. అస‌లేం జ‌రిగిందంటే..

విజ‌య‌వాడ కొత్తపేట పైలావారి వీధిలో రేవంత్ కుటుంబం నివ‌సిస్తున్నారు. అత‌ని త‌మ్ముడు తేజ‌కు పీసుపాటి చైత‌న్య అనే స్నేహితుడు ఉన్నాడు. త‌ర‌చూ ఇంటికి వ‌స్తూ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసిపోయాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను త‌న అన్న వెంక‌ట‌ర‌మ‌ణ ద‌క్షిణాఫ్రికాలో.. వ‌దిన రాజ్య‌ల‌క్ష్మి సింగ‌పూర్‌లో ఉద్యోగాలు చేశార‌ని చెప్పాడు. ఎవ‌రైనా విదేశాల్లో ఉద్యోగాలు అవ‌స‌ర‌మైన‌వారికి ఉద్యోగాలు ఇప్పించ‌గ‌ల‌ర‌ని చెప్పాడు.

అంతేకాదు.. స్థానికంగా ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న రేవంత్‌కి.. నీకు స‌రైన ఉద్యోగం లేదు క‌దా.. నీకు కావాలంటే విదేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తార‌ని న‌మ్మించాడు. అంతే కాదు.. ఓరోజు త‌న అన్న వ‌దిన‌ల‌ను వారి ఇంటికి తీసుకొచ్చాడు. ఈ సంద‌ర్భంగా మంచి ఉద్యోగం ప‌క్కాగా ఇప్పించ‌గ‌ల‌మ‌ని, అయితే రూ.15 ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని వారు స్ప‌ష్టం చేశారు. డ‌బ్బు రెడీ చేసుకుంటే జాబులో చేరిపోవ‌డ‌మేన‌ని చెప్పి వెళ్లిపోయారు.

వారి మాట‌లు న‌మ్మిన రేవంత్ త‌న తండ్రి సాయంతో ముందుగా రూ. 5 ల‌క్ష‌లు స‌మ‌కూర్చి వారికి అంద‌జేశాడు. 2021 మే నెల‌లో ఆ సొమ్మును వారికి అంద‌జేశాడు. మ‌రో రెండు నెల‌ల్లో అంటే జూలైలో మిగిలిన రూ.10 ల‌క్ష‌లు కూడా వారికి అందించాడు. ఆ సొమ్మును తీసుకున్న వెంక‌ట‌ర‌మ‌ణ‌, రాజ్య‌ల‌క్ష్మి.. నెల‌రోజుల్లో వీసా వ‌స్తుంద‌ని, విదేశాల్లో ఉద్యోగానికి రెడీగా ఉండాల‌ని చెప్పి వెళ్లిపోయారు. ఈ సంద‌ర్భంగా రూ.100 స్టాంపుపై వారు ఈ సొమ్ముకు సంబంధించి ష్యూరిటీ కింద రాసి సంత‌కాలు చేసి ఇచ్చారు.

నెల‌లు గ‌డుస్తున్నా ఉద్యోగం రాక‌పోవ‌డంతో రేవంత్ కుటుంబ‌స‌భ్యుల్లో ఆందోళ‌న మొద‌లైంది. వెంక‌ట‌ర‌మ‌ణ‌, రాజ్య‌ల‌క్ష్మిల‌కు ఫోన్ చేస్తే.. ఎత్త‌డం లేదు. దీంతో తాము మోస‌పోయామ‌ని గ్ర‌హించి వారు శ‌నివారం కొత్త‌పేట‌ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. వెంక‌ట‌ర‌మ‌ణ‌, రాజ్య‌ల‌క్ష్మి, చైత‌న్య‌ల‌పై ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై విచార‌ణ చేస్తున్నామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

First Published:  13 Nov 2022 2:36 AM GMT
Next Story