Telugu Global
Andhra Pradesh

కోవిడ్ ఇన్సూరెన్స్ పేరుతో భారీ మోసం.. అంతర్జాతీయ ముఠా గుట్టురట్టు

బీమా సొమ్ము పేరుతో కోవిడ్విడ్ బాధిత కుటుంబాలను మోసం చేస్తున్న ఓ అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టు చేశారు కడప జిల్లా పోలీసులు. ముఠాలో కీలక నిందితుడైన నేపాల్ కి చెందిన అశోక్ లోహర్ తోపాటు మరో ముగ్గురిని ఢిల్లీ వెళ్లి అరెస్ట్ చేశారు.

కోవిడ్ ఇన్సూరెన్స్ పేరుతో భారీ మోసం.. అంతర్జాతీయ ముఠా గుట్టురట్టు
X

కోవిడ్ తో మరణించినవారి కుటుంబాలే వారి టార్గెట్. మీ ఇంట్లో ఫలానా వారు కోవిడ్ కారణంగా చనిపోయారు కదా, ప్రభుత్వం మీకు బీమా రక్షణ కల్పిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజుల కింద కొంత మొత్తం చెల్లించండి అని కాల్ చేసి మరీ బాధితుల కుటుంబాలను మోసం చేస్తున్న ఓ అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టు చేశారు కడప జిల్లా పోలీసులు. ముఠాలో కీలక నిందితుడైన నేపాల్ కి చెందిన అశోక్ లోహర్ తోపాటు మరో ముగ్గురిని ఢిల్లీ వెళ్లి మరీ అరెస్ట్ చేశారు.

ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కారణంగా మరణించినవారి లిస్ట్ సేకరించిన ఈ ముఠా, వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తుంది. ఏపీలో వైఎస్సార్ బీమా వస్తుందని నమ్మబలుకుతుంది. కలెక్టరేట్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి మరిన్ని వివరాలు తెలుసుకుంటుంది. దీనికోసం ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలనుంచి యువకులను కాల్ సెంటర్ ఉద్యోగాలంటూ ఢిల్లీ రప్పించారు. అక్కడ పాలిమర్ బాగ్ లో ఓ గది అద్దెకు తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ బాధిత కుటుంబాలకు కాల్ చేయిస్తున్నారు. 50లక్షల రూపాయల బీమా సొమ్ము మంజూరైందని, అది బ్యాంకులో డిపాజిట్ కావాలంటే కొన్ని ఫార్మాలిటీలు పూర్తి చేయాలంటారు. ఇలా బద్వేలుకి చెందిన ఓ మహిళ, పొద్దుటూరు, కడప, ఖాజీపేటకు చెందిన వారి వద్దనుంచి 25లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కడప జిల్లా పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు.

కీలక నిందితుడు, నేపాల్‌కు చెందిన అశోక్‌ లోహర్‌ తోపాటు మరో ముగ్గురిని ఢిల్లీలో ప్రత్యేక పోలీస్ బృందాల సాయంలో అరెస్ట్ చేశారు. ఇటు కడపలో మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. 73 ఏటీఎం కార్డులు, 18 సెల్‌ఫోన్లు, 290 సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కోవిడ్ బీమా పేరుతో ఎవరైనా కాల్ చేసి, డబ్బులు అడిగితే ఇవ్వొద్దని సూచిస్తున్నారు పోలీసులు. మోసగాళ్ల వలలో పడొద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ముందుగా డబ్బులు అడిగితే తమకు ఫిర్యాదు చేయాలంటున్నారు.

First Published:  24 Oct 2022 6:34 AM GMT
Next Story