Telugu Global
Andhra Pradesh

నాలుగు ఘటనలూ చంద్రబాబును వెంటాడుతునే ఉంటాయా?

చంద్రబాబునాయుడు జీవితంలో నాలుగు ఘటనలు మాయనిమచ్చలుగా మిగిలిపోయాయి. మామూలుగా ఒకటి రెండు ఘటనలను భరించటమే కష్టమంటే చంద్రబాబు ఖాతాలో నాలుగు ఘటనలు జమయ్యాయి. ఈ నాలుగు ఘటనల్లో దేని తీవ్రత ఎక్కువంటే చెప్పటం కష్టమే.

నాలుగు ఘటనలూ చంద్రబాబును వెంటాడుతునే ఉంటాయా?
X

కొన్ని ఘటనలంతే కొందరిని జీవితాంతం వెంటాడుతునే ఉంటాయి. కొందరి జీవితాల్లో కొన్ని ఘటనలు ప్లస్సయితే మరికొందరికి మైనస్సులుగా మిగిలిపోతాయి. ఇపుడిదంతా ఎందుకంటే చంద్రబాబునాయుడు జీవితంలో నాలుగు ఘటనలు మాయనిమచ్చలుగా మిగిలిపోయాయి. మామూలుగా ఒకటి రెండు ఘటనలను భరించటమే కష్టమంటే చంద్రబాబు ఖాతాలో నాలుగు ఘటనలు జమయ్యాయి. ఈ నాలుగు ఘటనల్లో దేని తీవ్రత ఎక్కువంటే చెప్పటం కష్టమే.

మొదటి ఘటన వంగవీటి మోహనరంగా హత్య. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న వంగవీటి రంగా దీక్షలో ఉన్నపుడే 1988లో అర్ధరాత్రి హత్యకు గురయ్యారు. రంగాను హత్య చేయించింది చంద్రబాబే అని ఇప్పటికీ కాపులు చెప్పుకుంటునే ఉంటారు. తర్వాత రెండో ఘటన ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు. పార్టీని సంక్షోభంలో నుండి రక్షించుకునేందుకే నాయకత్వాన్ని మార్చుకోవాల్సొచ్చిందని ఎంత పాలిష్డ్ గా చెప్పినా చరిత్రలో 1995 ఘటన మాత్రం ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటుగానే మిగిలిపోయింది.

ఇదే విధంగా అప్పట్లోనే విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో హైదరాబాద్ బషీర్ బాగ్ ఫ్లైఓవర్ దగ్గర పోలీసు కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో నలుగురు చనిపోయారు. అదికూడా పెద్ద మచ్చగా మిగిలిపోయింది. ఎలాగంటే ఎప్పుడు ఏ ఉద్యమం జరిగినా జనాలంతా చంద్రబాబు హయాంలో జరిగిన పోలీసు కాల్పులను గుర్తుచేసుకునేంతగా. ఇక నాలుగో ఘటన ఏమిటంటే కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం విషయంలో చంద్రబాబు వ్యవహరించిన విధానం నెగిటివ్‌గా జనాల్లో నాటుకుపోయింది.

రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఉద్యమం చేసినపుడు ఆయనతో పాటు ఆయన భార్య, కొడుకు, కోడల్ని పోలీసులు కొట్టుకుంటూ, బూతులు తిడుతు ఈడ్చుకెళ్ళి పోలీసు వాహనంలో తీసుకెళ్ళారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనబడుతునే ఉన్నాయి. ముద్రగడ విషయంలో చంద్రబాబు వ్యవహరించిన విధానం వల్లే మొన్నటి ఎన్నికల్లో కాపులు టీడీపీకి నెగిటివ్‌గా ఓట్లేశారని చెబుతుంటారు. వంగవీటి రంగా, ముద్రగడ అంశాలు ఇప్పుడు ఎందుకు ప్రస్తావనకు వస్తున్నాయంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది కాబట్టే.

First Published:  16 Nov 2022 5:42 AM GMT
Next Story