Telugu Global
Andhra Pradesh

ప్రేమాలేదు.. పిండాకూడూ లేదని చెప్పా- వెన్నుపోటు ఘట్టంపై వెంకయ్య

వెంకయ్యనాయుడు నోటి నుంచే వెన్నుపోటు పదం రావడంతో అప్పట్లో జరిగింది వెన్నుపోటేనని ఆయన కూడా నిర్ధారించినట్టు అయింది. ఇప్పుడే కాదు గతంలోనూ వెంకయ్య వెన్నుపోటు ఘట్టాన్ని ప్రస్తావించారు.

ప్రేమాలేదు.. పిండాకూడూ లేదని చెప్పా- వెన్నుపోటు ఘట్టంపై వెంకయ్య
X

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు అంశాన్ని ప్రస్తావిస్తూ మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా పెనమనూరులో సహజ ఉత్పత్తుల కేంద్రాన్ని సందర్శించిన వెంకయ్యనాయుడికి కొందరు మహిళలు పాదాభివందనం చేశారు. అలా మహిళలు కాళ్లు మొక్కడాన్ని చూసిన వెంకయ్యనాయుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు.

అప్పట్లో ఎన్టీఆర్‌ వద్దకు కొందరు మహిళ నాయకురాళ్లు వచ్చి కాళ్లు మొక్కేవారని దానిపై తాను ప్రశ్నించగా.. వారి ప్రేమ, అనురాగం అలాంటిదని ఎన్టీఆర్ చెప్పారన్నారు. ఆ మహిళలు వెళ్లిపోయిన తర్వాత ప్రేమ లేదు పిండాకూడు లేదని ఎన్టీఆర్‌తో తాను చెప్పానన్నారు. ఆరోజు ఎన్టీఆర్‌కు కాళ్లు మొక్కిన ఆరుగురు మహిళలే వెన్నుపోటు ఘట్టంలో ముందున్నారని వెంకయ్యనాయుడు అనేశారు. దాంతో అక్కడున్న వారంతా నవ్వేశారు.

వెంకయ్యనాయుడు నోటి నుంచే వెన్నుపోటు పదం రావడంతో అప్పట్లో జరిగింది వెన్నుపోటేనని ఆయన కూడా నిర్ధారించినట్టు అయింది. ఇప్పుడే కాదు గతంలోనూ వెంకయ్య వెన్నుపోటు ఘట్టాన్ని ప్రస్తావించారు.

2016లో ఒకసారి అనంతపురం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా తన వెనుక చాలా మంది నిలబడి ఉండడాన్ని గమనించిన వెంకయ్యనాయుడు..'' బాబు ఇక్కడ ఎవరూ నిలబడవద్దు.. నా వెనుక అస్సలే నిలబడవద్దు. వెనుక నిల్చోబెట్టుకోవడం వల్ల ఎన్టీఆర్‌కు ఏమైందో తెలుసు కదా ?'' అంటూ అప్పట్లో మాట్లాడారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ వెనుక చంద్రబాబు నిలుచుకుని ఉన్న పాత ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేశారు.

First Published:  4 Nov 2022 9:35 AM GMT
Next Story