Telugu Global
Andhra Pradesh

చ‌ట్టానికి రామోజీ అతీతుడా?.. - ప్ర‌శ్నించిన ఉండ‌వ‌ల్లి

రామోజీ తప్పుచేశాడ‌ని ఆధారాలు స‌హా తాను చ‌ర్చ‌కు వ‌స్తాన‌ని, త‌ప్పు ఒప్పుకునే ధైర్యం రామోజీకి ఉందా అని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు. ఇదే ప్ర‌శ్న తాను 17 సంవ‌త్స‌రాలుగా అడుగుతున్నాన‌ని, ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌లేద‌న్నారు.

చ‌ట్టానికి రామోజీ అతీతుడా?.. - ప్ర‌శ్నించిన ఉండ‌వ‌ల్లి
X

రామోజీ ఏమైనా చ‌ట్టానికి అతీతుడా అని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ప్ర‌శ్నించారు. రాజ‌మ‌హేంద్రవ‌రంలో మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఉండ‌వ‌ల్లి మాట్లాడుతూ.. మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్స్ పై ఎవ‌రు ఫిర్యాదు చేశార‌ని కొంత‌మంది విలేక‌రులు సీఐడీ అధికారుల‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని.. రామోజీని ఇబ్బంది పెట్టేందుకే ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శి వ్య‌వ‌హారాన్ని ర‌చ్చ చేస్తోంద‌ని ఆరోపిస్తున్నార‌ని.. అలా అనుకుంటే తాను త‌ప్పు చేయ‌లేద‌ని రామోజీ ఎందుకు చెప్ప‌డం లేద‌ని ఉండ‌వ‌ల్లి సూటిగా ప్ర‌శ్నించారు.

చిట్‌ఫండ్స్ వ్య‌వ‌హారంలో త‌ప్పులు చేసిన రామోజీ.. వాటికి ఫోర్‌మెన్ల‌ను బాధ్యుల‌ను చేసి త‌ప్పించుకోవాల‌ని చూస్తున్నార‌ని ఉండ‌వ‌ల్లి మండిప‌డ్డారు. ఎన్ని కేసులు వేసినా రామోజీ కోర్టుకు వ‌చ్చిన దాఖ‌లాలు లేవ‌ని ఆయ‌న చెప్పారు.

రామోజీ తప్పుచేశాడ‌ని ఆధారాలు స‌హా తాను చ‌ర్చ‌కు వ‌స్తాన‌ని, త‌ప్పు ఒప్పుకునే ధైర్యం రామోజీకి ఉందా అని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు. ఇదే ప్ర‌శ్న తాను 17 సంవ‌త్స‌రాలుగా అడుగుతున్నాన‌ని, ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌లేద‌న్నారు. నిజానికి మార్గ‌ద‌ర్శి ఫైనాన్స్ షేర్‌పై తాను కేసు పెట్టే స‌మ‌యానికి కంపెనీ రూ.1360 కోట్ల అప్పుల్లో ఉందని, రామోజీ ఒక సెల‌బ్రిటీ కాబ‌ట్టి ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఉండ‌వ‌ల్లి ఆరోపించారు.

మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్స్‌కు, రామోజీరావుకు సంబంధం ఏమిట‌ని త‌న‌పై రూ.50 ల‌క్ష‌ల‌కు వేసిన ప‌రువు న‌ష్టం దావా అఫిడ‌విట్‌లో సంత‌కం చేసిన రామోజీ.. ఇప్పుడు అదే చిట్‌ఫండ్స్‌కు చైర్మ‌న్ రామోజీయేన‌ని తెలంగాణ హైకోర్టులో తాజాగా వేసిన అఫిడ‌విట్‌లో పేర్కొన్నార‌ని ఉండ‌వ‌ల్లి గుర్తుచేశారు. ఇది వ్య‌వ‌స్థ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డం కాదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఏపీ చిట్‌ఫండ్ 14 (2) చ‌ట్టం ప్ర‌కారం చిట్‌ఫండ్స్ ద్వారా సేక‌రించిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉన్నా.. మార్గ‌ద‌ర్శిలో మాత్రం అలా జ‌ర‌గ‌డం లేద‌ని ఉండ‌వ‌ల్లి తెలిపారు. ఆ డ‌బ్బును మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టార‌ని, ఈనాడు ప‌త్రిక సైతం చిట్‌ఫండ్స్ డ‌బ్బుతోనే న‌డుస్తోంద‌ని ఆయ‌న వివ‌రించారు.

మార్గ‌ద‌ర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించి గ‌తంలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ త‌న‌కిచ్చిన స‌మాచారాన్ని సీఐడీ అధికారుల‌కు పంపుతున్నాన‌ని, ఆ వివ‌రాల‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ)కి పంపి విచార‌ణ చేప‌ట్టాల‌ని తాను కోరుతున్న‌ట్టు ఉండ‌వ‌ల్లి వెల్ల‌డించారు.

First Published:  15 March 2023 2:53 AM GMT
Next Story