Telugu Global
Andhra Pradesh

రాష్ట్ర విభ‌జ‌న అంశంపై జ‌గ‌న్ స‌ర్కార్ అఫిడ‌విట్ శుభ‌ప‌రిణామం.. - మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి

విభ‌జ‌న వ‌ల్ల ఈ తొమ్మిదేళ్ల‌లో ఎంత నష్టపోయామో వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసిందని ఉండ‌వ‌ల్లి తెలిపారు. గతంలో ఉమ్మడి గవర్నర్ గా చేసిన నరసింహన్ తర్వాత కోర్టులో అఫిడవిట్ జ‌గ‌న్ ప్రభుత్వమే వేసిందన్నారు.

రాష్ట్ర విభ‌జ‌న అంశంపై జ‌గ‌న్ స‌ర్కార్ అఫిడ‌విట్ శుభ‌ప‌రిణామం.. - మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి
X

రాష్ట్ర విభజన అంశంపై వైఎస్ జ‌గ‌న్‌ ప్ర‌భుత్వం అఫిడ‌విట్ వేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ అన్నారు. మంగ‌ళ‌వారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్ర విభజన అంశంపై తాను వేసిన పిటీషన్‌పై ఈనెల 22న విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ ఏప్రిల్ 11వ తేదీకి అది వాయిదా పడిందని ఆయ‌న తెలిపారు. దీనిపై గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అఫడవిట్ వేస్తుందని భావించామని, ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అఫిడవిట్ వేయడం శుభపరిణామమని ఆయ‌న చెప్పారు. తన వాదనతో ఏకీభవిస్తూ ఈనెల 23న సమగ్ర అఫిడవిట్ ని కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వేసినందుకు సంతోషంగా ఉందన్నారు.

విభజన అన్యాయం అని మొదట్లో పిటీషన్ వేసినప్పటికీ, అది తేల‌లేద‌ని, దీంతో ఇది అన్యాయమా.. కాదా.. అని తేల్చి భవిష్యత్తులో ఇలా ఎక్కడా జరగ‌కుండా ఆదేశాలు ఇవ్వాలని, అలాగే రాష్ట్రానికి విభజన చట్టంలో పేర్కొన్న విధంగా న్యాయం జరిగేలా చూడాలని పిటీషన్ ని సవరించిన విషయాన్ని ఉండవల్లి గుర్తుచేశారు. కనీసం ఈ విధంగానైనా రాష్ట్రానికి మేలు కలుగుతుందని ఆశ ఉందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్ లో విభజన వలన రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి కూడా పేర్కొన్నారని చెప్పారు.

విభ‌జ‌న వ‌ల్ల ఈ తొమ్మిదేళ్ల‌లో ఎంత నష్టపోయామో వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసిందని ఉండ‌వ‌ల్లి తెలిపారు. గతంలో ఉమ్మడి గవర్నర్ గా చేసిన నరసింహన్ తర్వాత కోర్టులో అఫిడవిట్ జ‌గ‌న్ ప్రభుత్వమే వేసిందన్నారు. విభజన అంశంపై కేంద్రం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉన్నప్పటికీ వేయకుండా వేసినట్లు చెప్పిందని, అందుకే తమ న్యాయవాది అల్లంకి రమేష్ కౌంటర్ కాపీ ఇప్పించాలని లేఖ రాశారని ఆయన చెప్పారు. విభజన తర్వాత ఒక లక్షా 4వేల 601 కోట్ల రూపాయల ఆస్తులు హైదరాబాద్ లో పంపకం చేయాల్సి ఉంటే.. ఇంకా అందులో 91 శాతం పంపిణీ అవ్వలేదని ఉండ‌వ‌ల్లి గుర్తుచేశారు. పోలవరం విషయంలో కూడా రాష్ట్ర‌ప్ర‌భుత్వం అఫిడ‌విట్ వేయాలని ఆయన కోరారు.

అధికారంలో ఉన్నవాళ్లు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు కూడా తమ కేంద్ర కార్యాలయాలను రాష్ట్రానికి మార్చుకోవాలని, తద్వారా కొన్ని పన్నులు వస్తాయని ఉండ‌వ‌ల్లి చెప్పారు. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టడానికి వచ్చే ఛాన్స్ ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. అమరావతి రాజధాని అని టిడిపి అంటుంటే, విశాఖలో పెడతానని జగన్ అంటున్నారని, రాజధాని వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ అంశమని కేంద్రం అంటోందని, రాజధాని మార్పు అనేది ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ఆయన చెబుతూ.. ఈ కేసు కోర్టులో ఉన్నందున ఏ తీర్పు వస్తుందో చూడాలని తెలిపారు.

First Published:  28 Feb 2023 11:45 AM GMT
Next Story