Telugu Global
Andhra Pradesh

జగన్ గుర్తుంచుకో! హత్యలుండవ్.. ఆత్మహత్యలే ఉంటాయి

ప్రతిపక్షాలను అణిచివేసి అధికారంలో ఉండాలనుకుంటే అది సాధ్యం కాదన్నారు. జగన్‌ను జైలుకు పంపకపోయి ఉంటే ఈరోజు సీఎం అయ్యే వారా..? అని ప్రశ్నించారు.

జగన్ గుర్తుంచుకో! హత్యలుండవ్.. ఆత్మహత్యలే ఉంటాయి
X

రాష్ట్రానికి రావాల్సిన వాటి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ఎంపీలు గట్టిగా నిలదీయాలని కోరారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. పార్లమెంట్‌లో క‌నీసం ఏపీ అంశాలపై చర్చకు పట్టుబట్టే పని కూడా ఎంపీలు చేయడం లేదన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏపీకి పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం లేదన్నారు.


చివరకు జగన్‌కు చెందిన భారతి సిమెంట్‌, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ హెడ్‌ ఆఫీసులూ ఏపీకి రావడం లేదన్నారు. పన్ను రాయితీలు ఉన్నప్పుడే పరిశ్రమలు వస్తాయన్నారు. ఏపీ పెద్దలే సొంత సంస్థల హెడ్‌ ఆఫీసులను ఏపీకి తీసుకురానప్పుడు ఇతరులు ఎలా వస్తారని ప్రశ్నించారు.

తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ ఒక్క ఏడాది కూడా రెవెన్యూ లోటులో లేదన్నారు. చేసిన అప్పులను కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణానికే వాడారు కానీ... పింఛన్లు, జీతాల కోసం కాదన్నారు. ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. జీతాలు ఇచ్చేందుకు డబ్బులు కూడా ప్రభుత్వం దగ్గర లేవన్నారు.

అనపర్తిలో చంద్రబాబు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఏమాత్రం సరికాదన్నారు. రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్న విషయాన్ని జగన్‌ గుర్తించాలన్నారు. నిన్నటి ఘటన అధికార పార్టీకి చెడు చేసేదే తప్ప మంచి చేసేది కాదన్నారు. ప్రతిపక్షాలను అణిచివేసి అధికారంలో ఉండాలనుకుంటే అది సాధ్యం కాదన్నారు. జగన్‌ను జైలుకు పంపకపోయి ఉంటే ఈరోజు సీఎం అయ్యే వారా..? అని ప్రశ్నించారు.

అసలు అదానీపై ఆరోపణలు వస్తుంటే బీజేపీ నేతలు ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మోడీ ప్రధాని అయ్యే నాటికి ధనవంతుల జాబితాలో 609 స్థానంలో ఉన్న అదానీ ఇంత త్వరగా నాలుగో స్థానానికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ అదానీకి అనుకూలంగా మోడీ ప్రభుత్వం పాలసీలు సిద్ధం చేయడం వల్లనే అది సాధ్యమైందన్నారు.

రాష్ట్రాలు విపరీతంగా అప్పులు చేస్తున్నాయని చెబుతున్న మోడీ.. తన హయాంలోనే కేంద్రం 150 లక్షల కోట్ల అప్పు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ స్థాయిలో ప్రపంచంలో ఎక్కడా ఎవరూ అప్పు చేయలేదన్నారు.

First Published:  18 Feb 2023 7:26 AM GMT
Next Story