Telugu Global
Andhra Pradesh

నాలుగు రోజులు రామోజీ లాకప్‌లో ఉన్నారా?.. జైలు శిక్ష కూడా పడిందా?

అప్పటికి రామోజీ ఇంకా మార్గదర్శి సంస్థ‌ను ఏర్పాటు చేయలేదు. ఎలాంటి సంస్థ‌ను రిజిస్టర్ చేయకుండానే అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులకు ఎవరో ఫిర్యాదు చేశారట. దాంతో పోలీసులు రామోజీని పట్టుకుని విచారించారట.

నాలుగు రోజులు రామోజీ లాకప్‌లో ఉన్నారా?.. జైలు శిక్ష కూడా పడిందా?
X

వినటానికి నమ్మేట్లుగా లేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ చీటింగ్ కేసులో ముందు ముందు ఏమవుతుందా? అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైజాగ్ సమావేశంలో చెప్పిన ఒక విషయం సంచలనంగా మారింది. ఉండవల్లి మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల క్రితమే హైదరాబాద్‌లోని అబిడ్స్ పోలీసుస్టేషన్లో పోలీసులు రామోజీని నాలుగు రోజులు లాకప్‌లో పెట్టినట్లు ప్రసాద్ అనే మిత్రుడు చెప్పారట.

ఎందుకంటే చిట్ మోసంలోనే.. అప్పటికి రామోజీ ఇంకా మార్గదర్శి సంస్థ‌ను ఏర్పాటు చేయలేదు. ఎలాంటి సంస్థ‌ను రిజిస్టర్ చేయకుండానే అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులకు ఎవరో ఫిర్యాదు చేశారట. దాంతో పోలీసులు రామోజీని పట్టుకుని విచారించారట. విచారణలో ఫిర్యాదు వాస్తవమని తేలటంతో రామోజీని పోలీసులు నాలుగు రోజులు లాకప్‌లో పెట్టారట. తనకు ఈ విషయాన్ని చెప్పిన ప్రసాద్ అనే మిత్రుడు అన్నీ వివరాలను అందిస్తానని చెప్పారట.

ఈ విషయం అప్పారావుకు తెలియ‌కుండా ఉండదని ఉండవల్లి చెప్పారు. అప్పారావు అంటే రామోజీ తోడల్లుడు. రామోజీ ప్రారంభించిన ప్రతి వ్యాపారంలోనూ మొదట్లో అండగా ఉన్నది అప్పారావు మాత్రమే. అయితే ఆ తర్వాత అప్పారావునే మోసం చేశారట. ఈ విషయాన్ని స్వయంగా అప్పారావే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇలాంటిదే మరో వార్త కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

అదేమిటంటే పశ్చిమ గోదావరిలో వట్టి వసంతకుమార్ అని కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి వట్టి వెంకటపార్థసారథి అని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రెసిడెంట్‌గా పనిచేశారట. బ్యాంకులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఫుల్లుగా ఆర్టికల్స్ కుమ్మేశారట. దాంతో పార్థసారథి అప్పటికప్పుడు గవర్నమెంట్‌ ఆడిటర్స్ తో మొత్తం ఖాతాలు, జమా, ఖర్చులన్నింటినీ ఆడిట్ చేయించుకుని ఎలాంటి అవినీతి జరగలేదని సర్టిఫికెట్ తీసుకున్నారట. దాన్ని పట్టుకుని వార్త రాసిన విలేకరి దగ్గర నుండి రామోజీ వరకు అందరినీ తాడేపల్లిగూడెం కోర్టుకు లాగారట.

ప్రెసిడెంట్ వేసిన కేసు కారణంగా బ్యాంకులో అవినీతి జరిగిందని చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదట. దాంతో కోర్టులో కేసు కొట్టేయించుకునేందుకు రామోజీ తెగ ప్రయత్నించారట. అయితే అందుకు జడ్జి జనమంచి సాంబశివ్ ఒప్పుకోకుండా రామోజీని వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని ఆదేశించారట. దాంతో వేరేదారి లేక రామోజీ కోర్టు బోనులో నిలబడ్డారట. రెండు వైపులా వాదనలు విన్న తర్వాత జడ్జి రామోజీకి రెండు సంవత్సరాల జైలుశిక్ష విధించారట. అయితే దాన్ని జిల్లా కోర్టులో కొట్టేయించుకున్నట్లు సమాచారం.

First Published:  8 May 2023 6:02 AM GMT
Next Story