Telugu Global
Andhra Pradesh

ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ప‌నంతా అదే.. వెలంప‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చంద్రబాబుపై పవన్‌కు ప్రేమ లేదని, మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. పవన్‌కు చంద్రబాబుపై నిజంగా ప్రేమ ఉంటే ప్రైవేటు వైద్యం కావాలని కోర్టుకు వెళ్లాలన్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ప‌నంతా అదే.. వెలంప‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

చంద్రబాబు ఎప్పుడు పోతాడా..? టీడీపీని ఎప్పుడు జనసేనలో కలిపేసుకుందామా..? అని పవన్ కళ్యాణ్ తపిస్తున్నాడని వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రస్తుతం ఖైదీ అని.. జైల్లో ఖైదీకి ఏ విధమైన వసతులు అందుతాయో.. అవే ఆయనకు అందుతున్నాయని చెప్పారు. చంద్రబాబుకు ఏసీ కావాలని టీడీపీ నేతలు కోర్టును కోరడంతో జైల్లో ఏసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇప్పుడు కూడా చంద్రబాబుకు ప్రైవేటు వైద్యం కావాలంటే కోర్టుకు వెళ్లొచ్చుగా..? అని ప్ర‌శ్నించారు. పవన్ కళ్యాణ్ దీని గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఆయన షూటింగ్ లు చేసుకుంటూ.. ఫామ్ హౌస్‌లో ఉంటూ బిజీగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు పోతే అప్పుడు టీడీపీని కలిపేసుకుందామన్నదే పవన్ తపన అని అన్నారు.

చంద్రబాబుపై పవన్‌కు ప్రేమ లేదని, మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. పవన్‌కు చంద్రబాబుపై నిజంగా ప్రేమ ఉంటే ప్రైవేటు వైద్యం కావాలని కోర్టుకు వెళ్లాలన్నారు. చంద్రబాబు ఉక్కు అని టీడీపీ నేతలు అనే వారని, 30 రోజులు పక్కన పెడితే ఉక్కు తుక్కు అయిందన్నారు. చంద్రబాబుకు లేని రోగాలు అంటూ లేవని ఆయన కుటుంబ సభ్యులే రాష్ట్రం, దేశమంతా చెబుతున్నారన్నారు.

లోకేష్ సహా టీడీపీ నేతలకు సంకెళ్లు

చంద్రబాబుకు ఇప్పటికే సంకెళ్లు పడ్డాయని, తమకు కూడా సంకెళ్లు వేయాల‌న్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. టీడీపీ తలపెట్టిన `న్యాయానికి సంకెళ్లు` కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన కరువైందన్నారు. ఆ రోజు చంద్రబాబుకు సంకెళ్లు పడ్డాయని, ఇప్పుడు తమకు కూడా సంకెళ్లు వేయాలని టీడీపీ పిలుపు ఇస్తున్నట్లు ఉందని చెప్పారు. ఎవరైతే సంకెళ్లు పెట్టుకొని నిరసన తెలుపుతున్నారో వారికి కూడా సంకెళ్లు పడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు.

First Published:  16 Oct 2023 3:51 PM GMT
Next Story