Telugu Global
Andhra Pradesh

మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత‌కుమార్ క‌న్నుమూత‌

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2004, 2009 ఎన్నిక‌ల్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత‌కుమార్ క‌న్నుమూత‌
X

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత‌కుమార్ (70) క‌న్నుమూశారు. విశాఖ‌ప‌ట్నంలోని అపోలో ఆస్ప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న చికిత్స కోసం ఆస్ప‌త్రిలో చేరినా ఫ‌లితం లేక‌పోయింది. ఏలూరు జిల్లా భీమ‌డోలు మండ‌లం పూళ్ల ఆయ‌న స్వ‌గ్రామం. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2004, 2009 ఎన్నిక‌ల్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కేబినెట్‌లో 2009లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆయ‌న మ‌ర‌ణానంత‌రం కొణిజేటి రోశ‌య్య మంత్రి వ‌ర్గంలోనూ అదే శాఖ మంత్రిగా కొన‌సాగారు. అనంత‌రం న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి మంత్రివ‌ర్గంలో ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

2014 ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. 2018లో టీడీపీ-కాంగ్రెస్ క‌ల‌యిక త‌ర్వాత ఆయ‌న పార్టీకి కూడా దూర‌మ‌య్యారు. విశాఖ‌ప‌ట్నంలో కుటుంబంతో క‌ల‌సి నివాస‌ముంటున్నారు. ఆయ‌న భౌతిక కాయాన్ని విశాఖ‌ప‌ట్నం నుంచి స్వ‌గ్రామ‌మైన పూళ్ల‌కు త‌ర‌లించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.

First Published:  29 Jan 2023 4:48 AM GMT
Next Story