Telugu Global
Andhra Pradesh

సీఎంను తిట్టిన టేపులూ ఉన్నాయి. వాటిని ప్లే చేయాల్సింది - పేర్నినాని కౌంటర్లు

ఐదారుసార్లు గెలిచిన వారికే మంత్రి పదవులు రాలేదని గుర్తు చేశారన్నారు. అసలు జగన్‌ పార్టీ పెట్టకపోతే ఎంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యే వారో ఆలోచించుకోవాలన్నారు.

సీఎంను తిట్టిన టేపులూ ఉన్నాయి. వాటిని ప్లే చేయాల్సింది - పేర్నినాని కౌంటర్లు
X

ఫోన్‌ ట్యాపింగ్ చేశారు అందుకే పార్టీ మారుతున్నా అని కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి చెప్పడం ఉత్తుత్తి మాటలేనని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పార్టీ మారాలని నిర్ణయించుకుని.. మౌనంగా వెళ్తే సానుభూతి రాదు అన్న ఉద్దేశంతోనే ఇలా బురదజల్లుతున్నారని మండిపడ్డారు. జగన్‌ విషయంలో తాను కట్టప్పలాంటి వాడినని.. ఒకవేళ తన ఫోన్‌ ట్యాప్ చేస్తే దానికే పార్టీ వీడుతానా..? ఆ మాత్రం దానికే వెళ్లి చంద్రబాబుతో డీల్‌ మాట్లాడుకుంటానా..? అని వ్యాఖ్యానించారు. ట్యాపింగ్ అన్నది జరగలేదని.. ఒకవేళ జరిగినా ఏమవుతుందని ప్రశ్నించారు.

ట్యాపింగ్‌ యంత్రాలను కొనలేదని చంద్రబాబే చెప్పారని.. ఆ తర్వాత తామూ కొనలేదని, మరి ట్యాపింగ్ చేసే వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుందని నాని ప్రశ్నించారు. ఐదారుసార్లు గెలిచిన వారికే మంత్రి పదవులు రాలేదని గుర్తు చేశారన్నారు. అసలు జగన్‌ పార్టీ పెట్టకపోతే ఎంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యే వారో ఆలోచించుకోవాలన్నారు. నిజంగా జగన్‌ మీద భక్తి ఉంటే కోటంరెడ్డి పదవులు ఇవ్వలేదని బాధపడేవారు కాదన్నారు. ట్యాపింగ్‌పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుకుంటే చేసుకోండి అని వ్యాఖ్యానించారు.

ట్యాపింగ్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేయవద్దు అంటే ఈయన ఆగుతారా..? విచారణ జరపాలనుకుంటే కేంద్రం ఆగుతుందా..? చేసుకుంటే చేసుకోనీయండి అని లైట్‌ తీసుకున్నారు. రావత్‌ను తిట్టినవే కాకుండా.. ముఖ్యమంత్రిని తిట్టిన ఆడియోలు ఉన్నాయి కదా.. వాటిని ప్లే చేసి ఉండాల్సిందన్నారు పేర్ని నాని.

వారు తినే ప్రతి మెతుకు జగన్‌ భిక్షే-ఆనం విజయ్‌

కోటంరెడ్డి బ్రదర్స్ రాక్షసుల తరహాలో వ్యవహరించారని వైసీపీ నేత ఆనం విజయ్‌ కుమార్ రెడ్డి విమర్శించారు. అసలు జగన్‌ ఏం తక్కువ చేశారని ఆనం రామనారాయణరెడ్డి పార్టీకి దూరమయ్యారో అర్థం కావడం లేదన్నారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారిపైనైనా వేటు తప్పదన్నారు. తాను రామనారాయణరెడ్డికి తమ్ముడిగా కాకుండా జగన్‌ మనిషిగానే ఉంటానన్నారు. కోటంరెడ్డి బ్రదర్స్‌ తినే ప్రతి మెతుకూ జగన్‌ పెట్టిన భిక్షేనన్నారు. కౌన్సిలర్ స్థాయి కూడా లేని శ్రీధర్‌ రెడ్డికి ఎమ్మెల్యేను చేసిందే జగన్‌ అని.. టీడీపీతో కుమ్మక్కు అయి వైసీపీ మీద అభాండాలు వేయడం సరికాదన్నారు.

First Published:  1 Feb 2023 2:40 PM GMT
Next Story