Telugu Global
Andhra Pradesh

ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.. - మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం

వైసీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని, పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే పోలీసులు అడ్డుకోలేదని ఆయన తెలిపారు.

ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.. - మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం
X

ఎన్నికల సంఘం ఏపీలో దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలింగ్‌ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదని ఆయన చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టకుండా.. ఏకపక్షంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని మంత్రి పేర్ని నాని విమర్శించారు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే వారినే ఈసీ నియమించిందని పేర్ని నాని మండిపడ్డారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. డీజీపీకి సిట్‌ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదని ఆయన గుర్తుచేశారు. ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

వైసీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని, పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే పోలీసులు అడ్డుకోలేదని ఆయన తెలిపారు. టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదని, ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన చెప్పారు. పోలింగ్‌ ఆగినట్టు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ లాగ్‌ బుక్‌లో ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. ఛానళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా అంటూ నిలదీశారు. టీడీపీ పిన్నెల్లి వీడియోను ట్వీట్‌ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?. అసలు ఏం జరిగిందో విచారణ చేయరా?. కారంపూడిలో విధ్వంసకాండ జరిగితే చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నలు సంధించారు. లోకేష్‌ మాత్రం ఒక వీడియోను రిలీజ్‌ చేయగానే ఈసీ వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయమని ఆదేశించిందని, కోర్టులకు కూడా లేని అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఉపయోగించాలని చూసిందని విమర్శించారు. పల్నాడులో పోలీసు ఐజీ నాయకత్వంలోనే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయని నాని తెలిపారు. ఎల్లో మీడియాలో వార్తలు రాయగానే పోలీసులు, ఎన్నికల సంఘం చర్యలకు దిగుతోందంటూ ఆయన మండిపడ్డారు.

First Published:  26 May 2024 10:04 AM GMT
Next Story