Telugu Global
Andhra Pradesh

పురందేశ్వరిని జైల్లో వేయాలి.. - నిరాధార ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని

22 మంది ఐపీఎస్‌లపై ఎలాంటి ఆధారాలూ లేకుండా అవినీతి బురదజల్లడం ఎంతవరకు సబబని పేర్ని నాని ప్రశ్నించారు. బాబు జనతా పార్టీకి పురందేశ్వరి అధ్యక్షురాలని, బీజేపీకి కాదని ఆయన దుయ్యబట్టారు.

పురందేశ్వరిని జైల్లో వేయాలి.. - నిరాధార ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని
X

22 మంది ఐపీఎస్‌ అధికారులపై నిరాధార ఆరోపణలతో ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసినందుకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని జైల్లో వేయాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్‌ చేశారు. 22 మంది ఐపీఎస్‌లను బదిలీ చేయాలంటూ ఆమె సీఈసీకి ఆదేశాలివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. వారి స్థానాల్లో ఎవరిని నియమించాలో కూడా పురందేశ్వరి సిఫార్సు చేశారని, ఆమె ఏ హోదాలో ఈ సిఫార్సు చేస్తారని ఆయన నిలదీశారు. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటం కోసం పురందేశ్వరి బరితెగింపు రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పురందేశ్వరిది శిఖండి పాత్ర..

22 మంది ఐపీఎస్‌లపై ఎలాంటి ఆధారాలూ లేకుండా అవినీతి బురదజల్లడం ఎంతవరకు సబబని పేర్ని నాని ప్రశ్నించారు. బాబు జనతా పార్టీకి పురందేశ్వరి అధ్యక్షురాలని, బీజేపీకి కాదని ఆయన దుయ్యబట్టారు. నాడు కన్నతండ్రి చావులోనూ, నేడు పేదల పక్షపాతి సీఎం జగన్‌పై బురద‌ చల్లడంలోనూ ఆమెది శిఖండి పాత్రని ఆరోపించారు. బీజేపీలో తెలుగుదేశం దొంగలు పడ్డారనడానికి పోటీ అభ్యర్థులే సాక్ష్యమని ఆయన చెప్పారు. పురందేశ్వరిని, పవన్‌కల్యాణ్‌ని, రామోజీని, రాధాకృష్ణని మేనేజ్‌ చేయొచ్చేమో గానీ.. రాష్ట్ర ప్రజలను లొంగదీసుకోవడం చంద్రబాబు తరం కాదని ఆయన స్పష్టం చేశారు.

మార్గదర్శి అక్రమాలను వెలికితీసిన అధికారులపైనే లేఖలు రాశారు..

రామోజీ అక్రమాలకు వెన్నుదన్నుగా ఉన్న మార్గదర్శి సంస్థ అక్రమాలను వెలికి తీసిన అధికారులపైనే పురందేశ్వరి ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం చూస్తే ఆమె దిగజారుడు రాజకీయం తెలుస్తోందని పేర్ని నాని దుయ్యబట్టారు. ప్రజాధనం లూటీ చేసిన చంద్రబాబును ఆ కుంభకోణాల నుంచి కాపాడేందుకే 22 మంది ఐపీఎస్‌ అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. నిరాధార ఆరోపణలతో లేఖ రాసినందుకు పురందేశ్వరిని జైల్లో వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఐజీలు, జిల్లా ఎస్పీలను బదిలీ చేసి వారి స్థానాల్లో ఫలానా వారిని నియమించాలని సిఫార్సు చేస్తారా.. ఆమె ఎన్నికల సంఘానికే బాస్‌ గా వ్యవహరిస్తారా.. దీనిపై ఎన్నికల సంఘం ఎందుకు మాట్లాడటం లేదు.. ఇలాంటి తప్పుడు ఉత్తరాలను తిరిగి ఆమె ముఖాన్నే కొట్టాలి గదా.. అంటూ పేర్ని నాని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.

దీనిపై తమకు సమాధానం చెప్పాల్సిందేనని ఆయన ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. ఆధారాలైనా తెమ్మని ఆమెకు నోటీసులివ్వాలని, లేదంటే నిరాధార ఆరోపణలతో లేఖ రాసినందుకు జైల్లోనైనా వేయాలని స్పష్టం చేశారు. పురందేశ్వరి బరితెగింపు రాజకీయంపై, ఎన్నికల సంఘం అధికారుల మౌనంపై వైసీపీ తరఫున ఎన్నికల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేయనున్నామని చెప్పారు.

First Published:  5 April 2024 5:35 AM GMT
Next Story