Telugu Global
Andhra Pradesh

బాబుకి, జగన్‌కి.. నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది - మాజీ మంత్రి కురసాల కన్నబాబు

చంద్రబాబుకు ఎప్పుడూ దృష్టి లోపం ఉందని, అందుకే పేదల పక్షం వైపు చూడలేకపోయాడని విమర్శించారు. తన మ్యానిపెస్టోను చదువుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు.

బాబుకి, జగన్‌కి.. నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది  - మాజీ మంత్రి కురసాల కన్నబాబు
X

చంద్రబాబుకి, జగన్‌కి.. నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ అనే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించబోతున్నామని చెప్పారు. ఒక అబద్ధాలకోరు 2014 నుంచి 2019 మధ్య ప్రభుత్వాన్ని నడిపి చెప్పిన అబద్ధాలు.. మ్యానిఫెస్టోలో చెప్పినవి ఎన్ని చేశారు, ఎన్ని చేయలేదనేది తాము ఈ కార్యక్రమంలో భాగంగా వివరిస్తామని చెప్పారు. అలాగే ఒక నిజాయతీపరుడైన నాయకుడు, చెప్పాడంటే.. చేస్తాడంతే.. అని ఒక బ్రాండింగ్‌ ఉన్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి 2019 నుంచి 2023 వరకు ఏం చేశారనేది వివరిస్తామన్నారు. రాష్ట్రంలో పార్టీలకతీతంగా అర్హత కలిగిన ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా సంక్షేమ పథకాల లబ్ధిని జగన్‌ అందించారన్నారు.

చంద్రబాబు అవినీతిని కేంద్ర సంస్థలే బయటపెట్టాయని ఈ సందర్భంగా కన్నబాబు గుర్తుచేశారు. స్కీంల పేరుతో చంద్రబాబు అంతా దోచేశారని, ఆయన్ని కక్షపూరితంగా అరెస్ట్‌ చేయలేదని చెప్పారు. పక్కా ఆధారాలు ఉండటం వల్లే చంద్రబాబు జైలుకు వెళ్లారని స్పష్టం చేశారు. బాబు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన తెలిపారు. చంద్రబాబును అరెస్ట్‌ చేస్తే భూకంపం వస్తుందని టీడీపీ బిల్డప్‌ ఇచ్చిందని, కానీ చిన్న ప్రకంపన కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో వందల కోట్లు లాగేసినా అరెస్ట్‌ చేయకూడదా అని ఆయన ప్రశ్నించారు.

చెప్పిన అబద్ధాలే పదేపదే చెప్పడం ద్వారా జనాన్ని నమ్మించవచ్చనేది చంద్రబాబు, ఎల్లో మీడియా పద్ధతి అని, అందుకే ఏళ్ల తరబడి ఒకే అబద్ధాలను పదేపదే ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాయని కన్నబాబు విమర్శించారు. చంద్రబాబు వీరుడు, శూరుడు అంటూ గత 35 ఏళ్లుగా ఆయన్ని హీరోలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రజలు ఆ భ్రమల నుంచి బయటపడుతున్నారని, వాస్తవాలు వారికి అర్థమవుతున్నాయని, ఇకపై వారి అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆఖరికి గవర్నర్‌కి కూడా వారు అబద్ధాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

చంద్రబాబుకు ఎప్పుడూ దృష్టి లోపం ఉందని, అందుకే పేదల పక్షం వైపు చూడలేకపోయాడని విమర్శించారు. తన మ్యానిపెస్టోను చదువుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏనాడైనా జర్నలిస్టులకు సెంటు స్థలం ఇచ్చాడా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పత్రికా యాజమాన్యాలను మాత్రమే చూస్తాడని చెప్పారు. కలం కార్మికులను గుర్తించి మూడు సెంట్ల స్థ‌లం ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. యాజమాన్యాల వైపు చంద్రబాబు ఉంటే.. జర్నలిస్టుల వైపు జగన్‌ ఉన్నారని కురసాల కన్నబాబు పేర్కొన్నారు.

First Published:  8 Nov 2023 11:54 AM GMT
Next Story