Telugu Global
Andhra Pradesh

ఇప్పటంలో పవన్ కంటే మునుగోడులో పాల్ బెటర్..

ఇడుపులపాయలో హైవే వేయాలంటే పవన్‌ ముందు ప్రధాని కావాలన్నారు. ప్రధాని పదవికోసం పవన్‌, కేఏ పాల్‌ తో పోటీ పడుతున్నాడా..? అని ప్రశ్నించారు కొడాలి నాని.

ఇప్పటంలో పవన్ కంటే మునుగోడులో పాల్ బెటర్..
X

ఇప్పటంలో పవన్ కల్యాణ్ పరుగులు పెట్టడంపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు పేల్చారు. మునుగోడులో కేఏ పాల్ పోలింగ్ స్టేషన్ల దగ్గర పరుగులు పెట్టినట్టే ఇప్పటంలో పవన్ కూడా పరుగులందుకున్నారని, కానీ పాల్ ఎంటర్‌టైన్మెంట్ ముందు పవన్ వెనకపడిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటం షో అయిపోగానే పవన్ 2 గంటల్లోనే వెళ్లిపోయారని విమర్శించారు.

హైవే వేయాలంటే పవన్ ప్రధాన మంత్రి కావాలి..

సరిగ్గా రోడ్లు వేయలేని, గుంతలు పూడ్చలేని వైసీపీ ప్రభుత్వం ఇప్పటంలో రోడ్లు విస్తరణ చేస్తామన‌టం ప్రజలు ఎలా నమ్ముతారని, ఇలాగే చేస్తూ పోతే తాము అధికారంలోకి వచ్చాక ఇడుపుల పాయలో హైవే వేస్తామని హెచ్చరించారు పవన్ కల్యాణ్. దీనిపై కొడాలినాని ఘాటుగా స్పందించారు. ఇడుపులపాయలో హైవే వేయాలంటే పవన్‌ ముందు ప్రధాని కావాలన్నారు. ప్రధాని పదవికోసం పవన్‌, కేఏ పాల్‌ తో పోటీ పడుతున్నాడా..? అని ప్రశ్నించారు. జనసేన తరఫున 300 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని అవ్వమనండి అంటూ చెణుకులు విసిరారు. అప్పుడు ఇడుపులపాయలోనే కాదు, గుడివాడలో కూడా హైవే వేసుకోమనండి అంటూ చురకలంటించారు నాని.

తాగుబోతులు పవన్‌ ఇంటి ముందు హడావుడి చేస్తే.. రెక్కీ అంటూ పెద్ద పెద్ద పదాలు వాడుతున్నారని, గులకరాయితో చంద్రబాబుపై హత్యయత్నం జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు కొడాలి నాని. తనపై రాయి విసిరారని చంద్రబాబు డ్రామాలాడుతున్నారని, ఆయనే తన పార్టీ కార్యకర్తలతో రాళ్లు వేయించుకున్నారని ఎద్దేవా చేశారు. పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా..? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని అడిగే దమ్ము పవన్‌, చంద్రబాబుకు లేదన్నారు. పవన్‌ రాజకీయ అజ్ఞాని అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొలిటికల్ టూరిస్ట్ లు అంటూ ఎద్దేవా చేశారు.

First Published:  5 Nov 2022 12:00 PM GMT
Next Story